Guwahati Test : కోల్‌కతా టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన భారత జట్టు(Team India) ఏమాత్రం మెరుగవ్వలేదు. ఆ ఓటమి నుంచి తేరుకొని పుంజుకోవాల్సిన టీమిండియా మళ్లీ చతికిలబడింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు గంటలకొద్దీ క్రీజులో నిలిచిన చోట మనోళ్లు తడబడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో మార్కో జాన్సెన్(6-48)ను ఎదుర్కోలేక డగౌట్‌కు క్యూ కట్టారు. ఫలితంగా టెస్టుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. అనూహ్యంగా 201కే కుప్పకూలిన భారత్ ఇక డ్రా కోసమే ఆడాల్సిన పరిస్థితి. రెండు రోజుల ఆట మిగిలి ఉన్నందున సఫారీ బౌలింగ్ దళాన్ని కాచుకొని రిషభ్ పంత్ సేన సిరీస్ సమం చేయాలంటే ఏదైనా అద్భుతం జరగాలి.
సొంతగడ్డపై ఇటీవలే వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసిన భారత జట్టు ఇప్పుడు విజయం కోసం అష్టకష్టాలు పడుతోంది. టెస్టు ఛాంపియన్షిప్ విజేత దక్షిణాఫ్రికా బ్యాటర్లను నిలువరించలేక బౌలర్లు.. క్రీజులో నిలవలేక మన బ్యాటర్లు అపసోపాలు పడుతున్నారు. సమిష్టి వైఫల్యంతో తొలి ఇన్నింగ్స్‌లో 201కే ఆలౌటైన టీమిండియా మ్యాచ్‌ను దాదాపు అప్పగించేసినట్టే. సఫారీలు పరుగుల పండుగ చేసుకున్న చోట యశస్వీ జైస్వాల్(58) మినహా ఏ ఒక్కరూ రాణించలేదు.
Innings Break!#TeamIndia trail South Africa by 288 runs.
Over to our bowlers in the second innings.
Scorecard ▶️ https://t.co/Hu11cnrocG#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/qG9qEx4j94
— BCCI (@BCCI) November 24, 2025
రాహుల్‌ను కేశవ్ మహరాజ్ వెనక్కి పంపగా.. కాసేపటికే యశస్వీని హార్మర్ బోల్తా కొట్టించాడు. అనంతరం.. జాన్సెస్ (6-48) విజృంభణకు.. అద్భుత ఫీల్డింగ్ తోడవ్వగా 142కే ఏడు వికెట్లు కోల్పోయింది భారత్. ఆ దశలో క్రీజులో పాతుకుపోయిన వాషింగ్టన్ సుందర్(48), కుల్దీప్ యాదవ్(19) ఆపద్భాందవులయ్యారు. ప్రత్యర్ధి బౌలింగ్ దళాన్ని దీటుగా ఎదుర్కొన్న ఈ ద్వయం ఎనిమిదో వికెట్‌కు 72 రన్స్ జోడించి పరువు కాపాడింది. వీరిద్దరి అసమాన పోరాటంతో భారత్ 201 రన్స్ చేయగలిగింది. దాంతో.. పర్యాటక జట్టుకు 288 పరుగుల ఆధిక్యం లభించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న డబ్ల్యూటీసీ ఛాంపియన్ దక్షిణాఫ్రికా గువాటి టెస్టులో పట్టుబిగించింది. ఓపెనర్లు ఎడెన్ మర్క్రమ్(38), రియాన్ రికెల్టన్(35)లు 82 పరుగులతో శుభారంభమివ్వగా.. మిడిలార్డర్ అదే జోరు చూపించింది. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ కెప్టెన్ తెంబా బవుమా(41), ట్రిస్టన్ స్టబ్స్(49)లు స్కోర్‌బోర్డును నడిపించారు. వీరిద్దరూ ఔటైనా.. సెరులిన్ ముతుస్వామి (109), మార్కో జాన్సెస్(93)ల అద్భుత బ్యాటింగ్ షోతో 389 రన్స్ చేసింది సఫారీ టీమ్. అనంతరం భారత్‌ను 201కే కుప్పకూల్చి మ్యాచ్‌ను తమ చేతుల్లోకి తెచ్చుకుంది.
A Day 2 to Remember! 💯🔥
Centurion Senuran Muthusamy reflects on his maiden Test hundred after a superb knock in Guwahati. 🇿🇦 pic.twitter.com/zXM8o0t91a
— Proteas Men (@ProteasMenCSA) November 24, 2025
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 26 పరుగులు చేసింది పర్యాటక జట్టు. మూడో రోజు ఆట ముగిసే సరికి ఓపెనర్లు రియాన్ రికెల్టన్(13 నాటౌట్), ఎడెన్ మర్క్రమ్(12 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 314 పరుగుల ఆధిక్యంలో ఉన్న దక్షిణాఫ్రికా నాలుగో రోజు రెండో సెషన్‌లోపే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశముంది. టీమిండియా ముందు 400 ప్లస్ లక్ష్యాన్ని నిర్దేశించాలని బవుమా బ్యాచ్ భావిస్తోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్ కూడా టీమిండియా ఓడిపోవడం ఖాయం.