బ్యాంకాక్ : తొలి ప్రపంచ పారా ఆర్చరీ ర్యాంకింగ్ సిరీస్‌లో భారత ఆర్చర్లు సత్తాచాటారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన కాంపౌండ్ ఓపెన్ టీమ్ క్యాటగిరీల్లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. మహిళల, పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో మన ఆర్చర్లు గురితప్పని ప్రదర్శనతో పసిడి పతకాలు సాధించారు.
యువ సంచలనం శీతల్ దేవి, పాయల్ నాగ్‌తో కూడిన మహిళల డబుల్స్ జోడీ.. 150-147తో కజకిస్థాన్‌పై గెలిచి టైటిల్ గెలిచింది. మెన్స్ డబుల్స్‌లో తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామి ద్వయం 153-146తో చైనీస్ తైపీని చిత్తుచేసింది. మిక్స్డ్ డబుల్స్‌లో వరల్డ్ చాంపియన్లు శీతల్, తోమన్ జంట.. 153-146తో ఇండోనేషియాపై గెలిచి మూడు విభాగాల్లోనూ పతకాలతో క్లీన్‌స్వీప్ చేసింది. శీతల్, తోమన్ రెండు క్యాటగిరీల్లోనూ పతకాలు నెగ్గడం గమనార్హం.