షాంఘై: వరల్డ్ కప్ ఆర్చరీ స్టేజ్-2లో భారత కాంపౌండ్ జట్లకు నిరాశే ఎదురైంది. టీమ్ క్యాటగిరీలో పతకం గెలుస్తారని ఆశించిన పురుషుల, మహిళల జట్లూ తీవ్రంగా నిరాశపరిచాయి. ఆంధ్రా అమ్మాయి జ్యోతి సురేఖ, ప్రగతి, అదితితో కూడిన త్రయం.. క్వార్టర్స్‌లో 227-233తో టర్కీ చేతిలో ఓటమిపాలైంది. నిలకడగా రాణించిన టర్కీ ఆర్చర్ల జోరు ముందు భారత త్రయం తేలిపోయింది.
పురుషుల విభాగంలో ఓజస్, సాహిల్, కుశాల్ సెమీస్ చేరి పతకంపై ఆశలు రేపినా వాళ్లూ ఉత్తచేతులతోనే వెనుదిరగాల్సి వచ్చింది. సెమీస్‌లో భారత్ 234-235తో యూఎస్ఏ చేతిలో ఓడినా కాంస్య పోరుకు అర్హత సాధించింది.
చైనాతో జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ఇరుజట్లూ 234 పాయింట్లు స్కోరు చేయడంతో ఫలితం తేల్చేందుకు షూటాఫ్ అవసరమైంది. షూటాఫ్‌లోనూ రెండు జట్లూ ముప్పై పాయింట్లతో సమంగా ఉన్నా చైనా షూటర్లు రెండుసార్లు ఎక్స్ పాయింట్ (సెంటర్ మార్క్)ను కొట్టగా భారత్ ఒక్కసారే ఆ ఫీట్ సాధించడంతో చైనా కాంస్యం ఎగురేసుకుపోయింది.