సోనేపట్: భారత ఆర్చర్, తెలంగాణ బిడ్డ తానిపర్తి చికిత రావు ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌కు ఎంపికైంది. మూడు రోజుల పాటు హోరాహోరీగా సాగిన సెలక్షన్ ట్రయల్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన చికిత మహిళల కాంపౌండ్ విభాగానికి ఎంపికైంది. జపాన్‌లోని ఐచి నగోయా వేదికగా సెప్టెంబర్-అక్టోబర్‌లో జరగబోయే ఆసియా గేమ్స్‌తో పాటు వరల్డ్ కప్ స్టేజ్ 3, స్టేజ్ 4 టోర్నీల్లోనూ ఆమె దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ మేరకు భారత జట్టును ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సోమవారం ప్రకటించింది. మహిళల కాంపౌండ్ విభాగంలో స్టార్ ఆర్చర్, ఏపీకి చెందిన వెన్నం జ్యోతి సురేఖ భారత జట్టులో చోటు దక్కించుకున్న అత్యంత సీనియర్‌గా నిలిచింది.
ట్రయల్స్‌లో 15.5 పాయింట్లతో టాప్ ప్లేస్ సాధించిన ఆమె చికిత, యువ ఆర్చర్ పృతిక ప్రదీప్‌తో కూడిన కాంపౌండ్ బృందాన్ని నడిపించనుంది. తీవ్రమైన గాలి వీస్తున్న పరిస్థితుల్లో సాగిన ఈ ట్రయల్స్‌లో దీపికా కుమారి, అటాను దాస్, ఆసియా గేమ్స్ మల్టిపుల్ మెడలిస్ట్ అభిషేక్ వర్మ లాంటి దిగ్గజాలు జట్టులో చోటు కోల్పోయారు.ఏపీకి చెందిన ధీరజ్ పురుషుల రికర్వ్ జట్టుకు, తిరుమూరు గణేష్ మణిరత్నం కాంపౌండ్ జట్టుకు ఎంపికయ్యారు.