భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రపంచకప్ ఫైనల్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పలువురు అతిరథ మహారథులు అహ్మదాబాద్‌కు విచ్చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ రాక ఖరారు కాగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అంథోనీ అల్బనీస్‌కు ఆహ్వానం పంపినట్లు తెలిసింది. వీరికి తోడు బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్, సూపర్‌స్టార్ రజినీకాంత్,తారాగణం మొతెరా స్టేడియంలో సందడి చేసేందుకు రాబోతున్నారు.
లక్షా 30 వేల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా పేరొందిన ఈ వేదికలో ప్రతిష్ఠాత్మక పోరు కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరోవైపు ఫైనల్ రోజున పలు కార్యక్రమాలకు బీసీసీఐ రూపకల్పన చేసింది. మధ్యాహ్నం 12.30కు స్టేడియంపైన 10 నిమిషాల పాటు సూర్యకిరణ్ విమానాలు విన్యాసాలు చేయనున్నాయి. వింగ్ కమాండర్ సిదేశ్ కార్తీక్ నేతృత్వంలో తొమ్మిది విమానాలు రకరకాల విన్యాసాలతో కట్టిపడేయనున్నాయి. సాయంత్రం 5.30కు ఇప్పటి వరకు ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్లందరినీ బీసీసీఐ ఘనంగా సన్మానించనుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ నేతృత్వంలో 500 మందికి పైగా డ్యాన్సర్లు వివిధ సూపర్‌హిట్ పాటలకు నృత్యాలు చేయనున్నారు. యూకేకు చెందిన ఎల్ఎమ్ ప్రొడక్షన్స్..స్టేడియంలో లేజర్ షోతో ప్రేక్షకులను మరోలోకంలోకి తీసుకుపోనుంది.