ఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా గతేడాది రెజ్లర్లు చేపట్టిన ఆందోళన కారణంగానే ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెజ్లింగ్‌లో పతకాల సంఖ్య తగ్గిందని అధ్యక్షుడు సంజయ్ సింగ్ వ్యాఖ్యానించడం మరో దుమారానికి తెరలేపింది. ఇదే విషయమై ఇండియా టుడేతో సంజయ్ మాట్లాడుతూ.. ‘ఈ అంశం(రెజ్లర్లకు పతకాలు తగ్గడంపై)ను మరో కోణంలో గమనిస్తే గతేడాది సుమారు 14-15 నెలల పాటు రెజ్లర్లు ఢిల్లీ వీధుల్లో ఆందోళనలతోనే గడిపారు. దీంతో నిరసనల్లో పాల్గొన్న వారితో పాటు ఇతర రెజ్లర్లూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ కాలంలో వాళ్లు శిక్షణకు దూరమయ్యారు. జాతీయ, అంతర్జాతీయ టోర్నీలలోనూ పాల్గొనలేదు. అందుకే ఒలింపిక్స్‌లో మన రెజ్లర్లు ఆశించిన స్థాయిలో పతకాలు తీసుకురాలేదు. లేకుంటే రెజ్లింగ్‌లో భారత్‌కు మరిన్ని పతకాలు వచ్చుండేవి’ అని వ్యాఖ్యానించాడు. రెజ్లింగ్‌లో భారత్‌కు అమన్ సెహ్రావత్ ఒక్కడే పతకం తీసుకురాగా ‘అనర్హత వేటు’ ఎదుర్కున్న వినేశ్ ఫోగాట్ రజత పతకంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాగా గతేడాది బ్రిజ్ భూషణ్‌పై రెజ్లర్లు చేసిన పోరాటానికి వినేశ్ నేతృత్వం వహించిన విషయం విదితమే.