సొంతగడ్డపై టీమ్ఇండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ను చిత్తుచేసిన రోహిత్‌సేన వరుసగా 17వ టెస్టు సిరీస్ ఖాతాలో వేసుకుంది. ‘బజ్‌బాల్’తో దంచికొడతామని బీరాలు పలికిన ఇంగ్లిష్ ప్లేయర్లను నేలకు దింపుతూ.. మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ సిరీస్ పట్టేసింది!
స్వల్ప లక్ష్యఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అర్ధశతకాలతో అదరగొట్టగా.. ధ్రువ్ జురెల్, యశస్వి ఆకట్టుకున్నారు. ఒకదశలో 120 పరుగులకు 5 వికెట్లు కోల్పోవడంతో.. ఒక దశలో ఇంగ్లండ్‌కు ఆశలు చిగురించినా.. గిల్, జురెల్ చివరి వరకు నిలిచి మ్యాచ్‌ను ముగించారు.
రాంచీ: ‘బజ్‌బాల్’ ఎరాలో తొలిసారి ఇంగ్లండ్ జట్టుకు షాక్ తగిలింది. భారత్‌లో దూకుడు మంత్రం పనిచేయదని ఇంగ్లిష్ జట్టుకు బాగా తెలిసొచ్చింది. సొంతగడ్డపై తన ఆధిపత్యాన్ని కొనసాగించిన టీమ్ఇండియా.. వరుసగా 17వ టెస్టు సిరీస్‌తో సత్తాచాటింది. నాలుగు రోజుల్లో ముగిసిన రాంచీ టెస్టులో భారత్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసి మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో సిరీస్ ఖాతాలో వేసుకుంది. 2012-13లో స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన తర్వాత ఈ పుష్కర కాలంలో టీమ్ఇండియా మరో సిరీస్ ఓడలేదు. 192 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 40/0తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన రోహిత్ సేన 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది.
కెప్టెన్ రోహిత్ శర్మ (55; 5 ఫోర్లు, ఒక సిక్సర్), శుభ్‌మన్ గిల్ (52 నాటౌట్; 2 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించగా.. యశస్వి జైస్వాల్ (37), ధ్రువ్ జురెల్ (39) సత్తాచాటారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3 వికెట్లు పడగొట్టాడు. ఒక దశలో టీమ్ఇండియా 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్టు కనిపించినా.. గిల్, జురెల్ జోడీ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. బంతి అనూహ్యంగా తిరుగుతున్న పిచ్‌పై ఈ ఇద్దరూ గొప్ప సంయమనం పాటిస్తూ ముందుకు సాగారు. ఇరు జట్ల మధ్య వచ్చే నెల 7 నుంచి ధర్మశాల వేదికగా నామమాత్రమైన ఐదో టెస్టు జరగనుంది.
ఇంగ్లండ్ ప్లేయర్లకు బ్రేక్
సుదీర్ఘ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ నాలుగో టెస్టు తర్వాత విరామం తీసుకోనుంది. తదుపరి మ్యాచ్‌కు గడువు ఎక్కువ ఉండటంతో.. ఇంగ్లిష్ ప్లేయర్లు రెస్ట్ తీసుకోనున్నారు. ఆటగాళ్లు బెంగళూరు, చండీగఢ్‌లో ఉంటారని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
స్వదేశంలో వరుసగా అత్యధిక (17) సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా భారత్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఆస్ట్రేలియా రెండుసార్లు వరుసగా పదేసి సిరీస్‌లు నెగ్గింది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 353;భారత్ తొలి ఇన్నింగ్స్: 307; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 145; భారత్ రెండో ఇన్నింగ్స్: 192/5
(రోహిత్ 55, గిల్ 52 నాటౌట్; బషీర్ 3/79).