వడోదర: కొత్త ఏడాది స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఆదివారం నుంచి మొదలైన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ విజయంతో ప్రారంభించింది. తొలిసారి పురుషుల వన్డే సిరీస్‌కు వేదికైన వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. కివీస్ నిర్దేశించిన 301 పరుగుల ఛేదనలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ విరాట్ కోహ్లీ (91 బంతుల్లో 93, 8 ఫోర్లు, 1 సిక్స్) మరో క్లాస్ ఇన్నింగ్స్‌కు తోడు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (71 బంతుల్లో 56, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 49, 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో మరో ఓవర్ మిగిలుండగానే లక్ష్యాన్ని పూర్తిచేసింది.
హర్షిత్ రాణా ఆల్‌రౌండ్ షో (బ్యాట్‌తో 29, బంతితో 2/65)తో మెరిశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 రన్స్ చేసింది. డారిల్ మిచెల్ (71 బంతుల్లో 84, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), హెన్రీ నికోల్స్ (69 బంతుల్లో 62, 8 ఫోర్లు), డెవాన్ కాన్వే (67 బంతుల్లో 56, 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 14న రాజ్‌కోట్‌లో జరుగుతుంది.
ఛేదనలో రోహిత్ శర్మ (26) మెరుపులు మెరిపించినా ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండి రీఎంట్రీ ఇచ్చిన కెప్టెన్ గిల్ కూడా ప్రారంభంలో ఆచితూచి ఆడినా ఛేదనలో మొనగాడు కోహ్లీ మాత్రం తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ అభిమానులను అలరించాడు. ఎదుర్కున్న మూడో బంతినే మిడాన్ దిశగా బౌండరీతో పరుగుల వేటను ఆరంభించిన అతడు.. క్రీజులో ఉన్నంతసేపూ అదే జోష్‌ను కొనసాగించాడు. క్రిస్టియన్ క్లార్క్ ఓవర్లో రెండు, ఆదిత్య ఓవర్లో రెండు బౌండరీలు బాదిన కోహ్లీ.. 44 బంతుల్లోనే తన కెరీర్లో 77వ ఫిఫ్టీని నమోదుచేశాడు.
ఆరంభంలో నెమ్మదిగా ఆడిన గిల్.. ఆతర్వాత వేగం పుంజుకున్నాడు. 66 బంతుల్లో అతడి హాఫ్ సెంచరీ పూర్తైంది. అయితే ఆ తర్వాత అతడు భారత సంతతి స్పిన్నర్ ఆదిత్య బౌలింగ్‌లో ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరడంతో 118 పరుగుల రెండో వికెట్‌కు తెరపడింది. గిల్ స్థానంలో వచ్చిన అయ్యర్ కూడా జోరు కొనసాగించడంతో భారత్ లక్ష్యం వైపు వేగంగా సాగింది. అయితే కోహ్లీ శతకానికి 7 పరుగుల దూరంలో ఉండగా జెమీసన్ వరుస ఓవర్లలో భారత్‌కు షాకులిచ్చాడు. కోహ్లీతో పాటు జడేజా, అయ్యర్‌ను ఔట్ చేయడంతో అభిమానుల్లో కలవరం మొదలైంది. కానీ హర్షిత్, వాషింగ్టన్ (7*) అండగా కేఎల్ రాహుల్ (29*) లాంఛనాన్ని పూర్తిచేశాడు.
అంతకుముందు టాస్ ఓడి మొదలు బ్యాటింగ్ చేసిన కివీస్‌కు మెరుగైన ఆరంభమే దక్కింది. ఆ జట్టు ఓపెనర్లు కాన్వే, నికోల్స్ తొలి వికెట్‌కు శతాధిక భాగస్వామ్యం (117) నెలకొల్పి శుభారంభం అందించినా మిడిలార్డర్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. నిలకడగా ఆడిన ఈ ఇద్దరూ వాషింగ్టన్ వేసిన 20వ ఓవర్లో బౌండరీలతో అర్ధ శతకాలు సాధించారు. కానీ రాణా వరుస ఓవర్లలో నికోల్స్, కాన్వేను ఔట్ చేసి ఆ జట్టును దెబ్బకొట్టాడు.
సిరాజ్ కూడా యంగ్ (12)ను వెనక్కిపంపగా ప్రమాదకర ఫిలిప్స్ (12)ను కుల్దీప్ స్పిన్ మాయకు బలయ్యాడు. ఒకపక్క క్రమం తప్పకుండా వికెట్లు పడుతునా నిలకడగా ఆడిన మిచెల్.. 51 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. చివరి ఓవర్లలో అతడు ధాటిగా ఆడటంతో కివీస్.. భారత్ ఎదుట పోరాడగలిగే స్కోరును నిలపగలిగింది.

మ్యాచ్ ప్రారంభానికి ముందు దిగ్గజ క్రికెటర్లు రోహిత్, కోహ్లీ ద్వయాన్ని బరోడా క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి ఐసీసీ చైర్మన్ జై షా, బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ తదితరులు హాజరయ్యారు.
అంతర్జాతీయ క్రికెట్లో రన్మిషీన్ కోహ్లీ మరో రెండు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. వడోదర వన్డేలో 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా 28 వేల పరుగుల మార్కును అందుకున్న క్రికెటర్‌గా అతడు రికార్డులకెక్కాడు. 624 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. సచిన్ (644 ఇన్నింగ్స్), సంగక్కర (666) రికార్డులను కోహ్లీ అధిగమించాడు. అంతేగాక ఈ మ్యాచ్‌లో కోహ్లీ.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ (34,357) తర్వాత రెండో స్థానానికి (28,068) ఎగబాకి సంగక్కర (28,016)ను మూడో స్థానానికి నెట్టాడు.
న్యూజిలాండ్: 50 ఓవర్లలో 300/8 (మిచెల్ 84, నికోల్స్ 62, సిరాజ్ 2/40, ప్రసిద్ధ్ 2/60);
భారత్: 49 ఓవర్లలో 306/6 (కోహ్లీ 93, గిల్ 56, జెమీసన్ 4/41, ఆదిత్య 1/73)