వన్డే వరల్డ్‌కప్‌లో టీమ్ఇండియా తొలి విఘ్నాన్ని అధిగమించింది. ఐసీసీ టోర్నీల్లో కొరుకుడు పడని కంగారూలపై మనవాళ్లు సంపూర్ణ ఆధిపత్యం కనబర్చారు!
మొదట బౌలర్లు రాణించి ఆసీస్‌ను రెండొందల లోపే కట్టడి చేస్తే.. ఛేదనలో రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో.. కోహ్లీ, రాహుల్ చక్కటి ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌ను మన వశం చేశారు!!
చెన్నై చెపాక్ పిచ్‌పై జడేజా, అశ్విన్‌ను ఎదుర్కోవడం ఎంత కష్టమో కంగారూలకు తెలిసిరాగా.. పుష్కరకాలం తర్వాత స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది.
చెన్నై: స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్ విజయాల వేట ప్రారంభించింది. లీగ్ దశలో భాగంగా ఆదివారం జరిగిన పోరులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (46; 5 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (41; 6 ఫోర్లు) రాణించగా.. మిషెల్ స్టార్క్ (28), మార్నస్ లబుషేన్ (27) కాస్త పోరాడారు. భారత బౌలర్లలో జడేజా 3, బుమ్రా, కుల్దీప్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సిరాజ్, పాండ్యా, అశ్విన్ తలా ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (0), ఇషాన్ కిషన్ (0), శ్రేయస్ అయ్యర్ (0) సున్నాలు చుట్టగా.. కేఎల్ రాహుల్ (115 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (116 బంతుల్లో 85; 6 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హజిల్‌వుడ్ మూడు వికెట్లు తీశాడు. రాహుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
స్పిన్నర్ల హవా..
వరల్డ్‌కప్ మాట వింటే చాలు పూనకం వచ్చినట్లు రెచ్చిపోయే కంగారూలకు మన స్పిన్నర్లు ముకుతాడు వేశారు. ఈ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే ఎక్కువ విజయాలు సాధించిన నేపథ్యంలో కమిన్స్ టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో కోహ్లీ పట్టిన కండ్లు చెదిరే క్యాచ్‌కు మార్ష్ (0) ఔట్ కాగా.. ఆ తర్వాత వార్నర్, స్మిత్ ఆసీస్‌ను ఆదుకున్నారు. వీరిద్దరితో పాటు లబుషేన్ కూడా రాణించడంతో ఒక దశలో ఆసీస్ 110/2తో పటిష్ట స్థితిలో కనిపించింది. అయితే స్లో పిచ్‌పై తమ ప్రతాపం చూపిన అశ్విన్, జడేజా, కుల్దీప్ పరుగులు నియంత్రిస్తూ.. కంగారూలపై ఒత్తిడి పెంచారు. దీంతో ధాటిగా ఆడేందుకు యత్నించిన ఆసీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు 89 పరుగుల తేడాలో చివరి 8 వికెట్లు చేజార్చుకుంది.
కోహ్లీ ఉన్నాడు బాస్!
ఇన్నింగ్స్ విరామం అనంతరం తిరిగి అభిమానులు ఇంకా సీట్లలో కూర్చోకముందే.. భారత్‌కు దెబ్బమీద దెబ్బ తగిలింది. ఇషాన్ తొలి ఓవర్లోనే ఔట్ కాగా.. రెండో ఓవర్లో డబుల్ స్ట్రోక్‌గా రోహిత్, శ్రేయస్ వెనుదిరిగారు. ఈ దశలో మ్యాచ్‌పై ఆసీస్ పట్టు బిగించినట్లే అనిపించింది. కానీ కోహ్లీ ఉన్నంత వరకు కంగారూలకు ఇబ్బంది తప్పదని ఆసీస్ మాజీ కెప్టెన్ క్లార్క్ అన్నట్లు.. విరాట్ తన పవర్ ఏంటో చాటాడు. పరిస్థితులు సవాలు విసురుతున్న సమయంలోనే తనలోని అసలు సిసలు పోరాట యోధుడిని తట్టిలేపే కోహ్లీ.. వికెట్ల మధ్య పరిగెడుతూనే 61 పరుగులు తీశాడంటే.. అతడి ఇన్నింగ్స్ విలువేంటో అర్థం చేసుకోవచ్చు!
అతడే మన మూల విరాట్!
నాలుగు మ్యాచ్‌ల్లో పరుగులు సాధిస్తే చాలు.. కోహ్లీతో పోల్చేయడం! ఓ ఆర్నెళ్లు నిలకడగా రాణిస్తే చాలు ప్రిన్స్ అంటూ మోసేయడం అలవాటైపోయిన తరుణంలో తనను కింగ్ అని ఎందుకు పిలుస్తారో విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించాడు. ఒత్తిడి కొండలా పెరిగిపోతున్న సమయంలో దాన్ని ఎలా చిత్తు చేయాలో కోహ్లీకి తెలిసినంత బాగా.. సమకాలిన క్రికెట్లో మరెవరికీ తెలియదనడంలో ఇసుమంత అతిశయోక్తి లేదు. పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగితే.. నడిపిస్తాడనుకున్న సారథి రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో మొనగాడు అనిపించుకున్న శ్రేయస్ అయ్యర్ సున్న చుట్టడంతో బ్యాట్ నుంచి ఒక్క పరుగూ రాకముందే.. భారత్ 3 వికెట్లు కోల్పోయింది.
ఇలాంటి సమయంలో మరో ఆటగాడైతే కచ్చితంగా ఒత్తిడికి గురయ్యేవాడే! కానీ అక్కడ ఉన్నది రన్‌మెషీన్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ అని కంగారూలకు తెలిసి రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా రాణించాలో.. ప్రత్యర్థులు ఆధిపత్యం ప్రదర్శిస్తున్న సమయంలో ఎలా నిలదొక్కుకోవాలో ఉగ్గుపాలతోనే నేర్చుకున్న కోహ్లీ.. చెన్నైలో మరోసారి తన విలువేంటో చాటుకున్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో నాలుగు మ్యాచ్‌ల్లో సత్తాచాటగానే టీమ్ఇండియాకు ఆడేయొచ్చు అనుకుంటున్న ప్లేయర్లకు విరాట్ అంటే ఏంటో ఈ ఇన్నింగ్స్ మరోసారి నిరూపించింది. గతంలో ఎన్నోసార్లు ఇలాంటి క్లిష్ట పరిస్థితులను అవలీలగా ఎదుర్కొన్న కోహ్లీ.. అదే సంయమనం మరోసారి కనబర్చాడు.
ఒక్కో పరుగుతో ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించాలో.. చాపకింద నీరులా స్కోరు బోర్డును ఎలా ముందుకు నడపాలో అక్షరాల ఆచరణలో చూపాడు. క్యాచ్ మిస్ కావడంతో ఊపిరి పీల్చుకున్న కోహ్లీ ఆ తర్వాత పెవిలియన్ చేరేంత వరకు ఒక్క లూజ్ షాట్ కూడా ఆడలేదంటే.. అతడు తన వికెట్‌కు ఇచ్చిన విలువేంటో అర్థం చేసుకోవచ్చు. వన్డే క్రికెట్లో స్ట్రయిక్ రొటేషన్ ఎంత ముఖ్యమో చాటిన కోహ్లీ.. రాహుల్‌కు దిశానిర్దేశం చేస్తూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత స్కోరు బోర్డు చూసిన వాళ్లకు కోహ్లీ కంటే రాహుల్ ఎక్కువ పరుగులు చేసినట్లు కనిపించినా.. అసలు సిసలు క్రీడాభిమానులను అడిగితే తెలుస్తుంది విరాట్ ఇన్నింగ్స్ విలువేంటో!
-నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా: 49.3 ఓవర్లలో 199 (స్మిత్ 46, వార్నర్ 41; జడేజా 3/28, బుమ్రా 2/35), భారత్: 41.2 ఓవర్లలో 201/4 (కోహ్లీ 85, రాహుల్ 97*; హజిల్‌వుడ్ 3/38).