బ్యాంకాక్: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ అదిరిపోయే రీతిలో బోణీ కొట్టింది. ఆసియా అథ్లెటిక్స్ సమాఖ్య ఏర్పాటై 50 ఏండ్లు అయిన సందర్భంగా జరుగుతున్న టోర్నీ మొదటి రోజే భారత్ ఖాతాలో పతకం చేరింది. బుధవారం జరిగిన పురుషుల 10,000 మీటర్ల రిలే రేసులో అభిషేక్‌పాల్ కాంస్య పతకం సాధించాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన రేసును అభిషేక్ 29.33.26 సెకన్లలో పూర్తి చేశాడు.
మరోవైపు డెకాథ్లాన్ తొలి రోజు పోటీల్లో తేజస్విన్ శంకర్4124 పాయింట్లతో పసిడి పతకం దిశగా దూసుకెళుతున్నాడు. మహిళల జావెలిన్‌త్రోలో అన్నురాయ్ 59.10 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల రేసులో రాజేశ్ రమేశ్, మహమ్మద్ అజ్మల్..ఫైనల్స్‌కు అర్హత సాధించారు. మహిళల 400 మీటర్ల రేసులో ఐశ్వర్య మిశ్రా తుది పోరులో నిలిచింది. ఆసియా అథ్లెటిక్స్ టోర్నీకి హనుమంతున్ని అధికారిక మస్కట్‌గా ఎంపిక చేశారు.