ఢాకా : కాంపౌండ్ ఆర్చర్లు సత్తా చాటడంతో ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో గురువారం ఒక్కరోజే భారత్ ఏకంగా ఐదు పతకాలు సొంతం చేసుకుంది. ఇందులో మూడు స్వర్ణాలు ఉండటం విశేషం. తెలుగమ్మాయి జ్యోతి సురేఖ వెన్నంతో పాటు అభిషేక్ వర్మ లక్ష్యం వైపు గురిపెట్టి పతకాల పంట పండించారు. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగం ఫైనల్లో జ్యోతి.. 147-145తో భారత్‌కే చెందిన ప్రీతిక ప్రదీప్‌పై గెలిచి పసిడి నెగ్గింది.
ప్రీతికకు రజతం దక్కింది. జ్యోతి, ప్రీతిక, దీప్షిక త్రయంతో కూడిన ఉమెన్స్ టీమ్ ఫైనల్లో భారత్.. 236-234తో కొరియాను ఓడించి బంగారు పతకం సాధించింది. పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో ప్రథమేశ్, సాహిల్, అభిషేక్ వర్మ త్రయం.. 229-230తో కజకిస్థాన్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఇదే విభాగం మిక్స్డ్ ఈవెంట్లో దీప్షిక, అభిషేక్ వర్మ ద్వయం.. 153-151తో బంగ్లాదేశ్‌పై నెగ్గి స్వర్ణం గెలిచింది.