ఆసియాకప్‌లో దాయాది పాకిస్థాన్‌పై భారత్ బెబ్బులిలా గర్జించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన తొలి పోరులో పాక్‌ను చీల్చిచెండాడుతూ టీమ్ఇండియా విజయబావుటా ఎగురవేసింది. బాయ్‌కాట్ నిరసన మధ్య ఉద్విగ్నంగా సాగిన మ్యాచ్‌లో పాక్‌ను తమ స్పిన్ తంత్రంతో పడగొడుతూ స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. ఆపరేషన్ స్పిన్ త్రయం కుల్దీప్యాదవ్, అక్షర్‌పటేల్, వరుణ్ ధాటికి పాక్ చిగురుటాకులా వణికింది. బంతి ముట్టుకుంటే ఔట్ అన్న రీతిలో మన స్పిన్నర్లు పాక్‌పై ముప్పేటా దాడి చేశారు. స్వల్ప లక్ష్యఛేదనలో యంగ్డైనమిక్ అభిషేక్ వీరవిహారం చేయగా, సూర్యకుమార్, తిలక్‌వర్మ జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. కనీసం కరచాలనం లేకుండానే పాక్‌పై భారత్ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
దుబాయ్: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ‘మ్యాచ్ బాయ్‌కాట్’ నేపథ్యంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌దే పైచేయి అయ్యింది. ఆదివారం వార్వన్సైడ్ అన్నట్లు సాగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సొంతం చేసుకుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో భారత్ నాలుగు పాయింట్లతో గ్రూపు-ఏలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. కుల్దీప్యాదవ్(3/18), అక్షర్‌పటేల్ (2/18), బుమ్రా (2/28) ధాటికి పాక్ 20 ఓవర్లలో 127/9 స్కోరుకు కుప్పకూలింది. ఫర్హాన్(40), ఆఫ్రిదీ(33 నాటౌట్) రాణించారు. లక్ష్యఛేదనలో భారత్ 15.5 ఓవర్లలో 131/3 స్కోరు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్(47 నాటౌట్), అభిషేక్‌వర్మ(31), తిలక్‌వర్మ(31) విజయంలో కీలకమయ్యారు. ఈనెల 19న ఒమన్‌తో భారత్ తలపడనుంది.
స్పిన్ ఉచ్చులో పాక్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ మొదటి బంతికే పాక్ ఓపెనర్ సయిమ్ ఆయూబ్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. హార్దిక్ బంతిని షాట్ ఆడే క్రమంలో పాయింట్లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆరు బంతుల తేడాతో మహమ్మద్ హరిస్(3) బుమ్రా ఖాతాలో చేరాడు. ఆయూబ్‌ను అనుసరిస్తూ డీప్ బ్యాక్వర్డ్ స్కేర్‌లో హార్దిక్ పట్టిన క్యాచ్‌తో హరిస్ రెండో వికెట్‌గా ఔట్ కావడంతో పాక్ 6 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఫర్హాన్(40), ఫకర్ జమాన్(17) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజానేసుకున్నారు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ అడపాదడపా బౌండరీలు సాధించడంతో పవర్‌ప్లే ముగిసే సరికి పాక్ 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. బౌలింగ్ మార్పుగా వచ్చిన అక్షర్‌పటేల్..ఎనిమిదో ఓవర్లో జమాన్‌ను ఔట్ చేసి పాక్ వికెట్ల పతనానికి నాంది పలికాడు. భారీ షాట్ ఆడే క్రమంలో లాంగ్‌ఆన్‌లో తిలక్‌వర్మ పట్టిన క్యాచ్‌తో జమాన్ ఔట్ కావడంతో మూడో వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఇక్కణ్నుంచి భారత స్పిన్నర్లు పాక్ బ్యాటర్లు లక్ష్యంగా వికెట్ల వేట కొనసాగించారు. ఓవర్ తేడాతో కెప్టెన్ సల్మాన్ అగా(3)ను తన ఖాతాలో వేసుకోవడంతో పాక్ కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ఇదే అదనుగా తమ అమ్ములపొదిలోని కీలక ఆస్త్రమైన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్యాదవ్ను సూర్యకుమార్ ప్రయోగించడం బాగా కలిసొచ్చింది. కుల్దీప్ 13వ ఓవర్లో వరుస బంతుల్లో హసన్ నవాజ్(5), మహమ్మద్ నవాజ్(0) వెంటవెంటనే ఔట్ చేయడంతో పాక్ 65 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఓవైపు సహచరులు పెవిలియన్‌కు క్యూ కడుతున్నా..ఫర్హాన్ పరిణతి కనబరిచాడు. మరోమారు బౌలింగ్‌కు వచ్చిన కుల్దీప్..ఈసారి ఫర్హాన్‌ను ఔట్ చేయడంతో పాక్ 100 పరుగుల లోపే కుప్పకూలుతుందనుకున్నారు. ఆఖర్లో ఆఫ్రిదీ(16 బంతుల్లో 33 నాటౌట్, 4 సిక్స్‌లు) బ్యాటు ఝులిపించడంతో పాక్‌కు గౌరవప్రదమైన స్కోరు దక్కింది. మొత్తంగా స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్, వరుణ్..పాక్ నడ్డివిరువడంలో కీలకమయ్యారు.
భారత్ ఆడుతూ పాడుతూ : పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. పాక్ స్టార్ బౌలర్ ఆఫ్రిదీ వేసిన తొలి రెండు బంతులను కండ్లు చెదిరే రీతిలో అభిషేక్‌శర్మ ఫోర్, సిక్స్‌గా మలిచి ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పాడు. మరో ఎండ్‌లో అగ్నికి ఆయువు తోడైనట్లు శుభ్‌మన్‌గిల్ వరుసగా రెండు ఫోర్లు కొట్టి జోరు పెంచాడు. అయితే ఆయూబ్ ఊరించే బంతిని ముందుకొచ్చి ఆడే క్రమంలో గిల్(10) స్టంపౌట్ అయ్యాడు. ఓవైపు గిల్ ఔటైనా..అభిషేక్..ఆఫ్రిదీని బాదడం ఆపలేదు. మళ్లీ ఓ ఫోర్, సిక్స్‌తో గట్టిగా అరుసుకున్నాడు. మరుసటి ఓవర్లో ఆయూబ్‌ను వరుసగా రెండు ఫోర్లు బాదిన అభిషేక్..అష్రఫ్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో తిలక్‌వర్మ, సూర్యకుమార్ ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకోగా, పవర్‌ప్లే పూర్తయ్యే సరికి టీమ్ఇండియా 64/2 స్కోరు చేసింది. పాక్‌కు ఏమాత్రం అవకాశమివ్వని ఈ ఇద్దరు బౌండరీలతో లక్ష్యాన్ని కరిగించే ప్రయత్నం చేశారు. సాఫీగా సాగుతున్న సమయంలో ఆయూబ్ బౌలింగ్‌లో తిలక్ ఔట్ కావడంతో మూడో వికెట్‌కు 56 పరుగుల పార్టనర్షిప్కు బ్రేక్ పడింది. తిలక్ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్‌దూబే..సూర్యకు జతకలిశాడు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జట్టును గెలుపు తీరాలకు చేర్చారు.
పాకిస్థాన్: 20 ఓవర్లలో 127/9 (ఫర్హాన్ 40, ఆఫ్రిదీ 33 నాటౌట్, కుల్దీప్ 3/18, అక్షర్ 2/18)
భారత్: 15.5 ఓవర్లలో 131/3 (సూర్యకుమార్ 47 నాటౌట్, అభిషేక్ 31, ఆయూబ్ 3/35).
భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు సూర్యకుమార్‌యాదవ్, సల్మా న్ ఒకరికొకరు కరచాలనం చేసుకోలేకపోయారు. మామూలుగా టాస్ వేసేటప్పుడు కెప్టెన్లు తమ జట్ల వివరాలను ఒకరికొకరు అందజేసుకుంటూ షేక్ హ్యాండ్ఇచ్చుకోవడం ఆనవాయితీ. కానీ పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇప్పటికే మ్యాచ్ బాయ్‌కాట్ అంటూ తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న క్రమంలో సూర్యకుమార్..పాక్ కెప్టెన్ సల్మాన్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఇద్దరు కెప్టెన్లు తమ జట్టకు సంబంధించిన టీమ్ షీట్లను మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాఫ్ట్‌కు అందించి ఎవరి స్థానాల్లో నిలుచున్నారు. రవిశాస్త్రి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.