రాయ్‌పూర్: వేదిక మారినా భారత జట్టు దూకుడు మారలేదు. రాయ్‌పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఆ జట్టు నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యం టీమ్ఇండియాకు ఏమాత్రం సరిపోలేదు. ఇటీవల స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడుతున్న సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 82 నాటౌట్, 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు సుమారు మూడేండ్ల తర్వాత ఇటీవలే జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 76, 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడటంతో లక్ష్యాన్ని భారత్ 28 బంతులుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదేసింది.
ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యం సాధించింది. మొదట బ్యాటిం గ్ చేసిన న్యూజిలాండ్.. రచిన్ రవీంద్ర (26 బంతుల్లో 44, 2 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (27 బంతుల్లో 47 నాటౌట్, 6 ఫోర్లు, 1 సిక్స్) తో పాటు మిగిలిన బ్యాటర్లంతా సమష్టిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 రన్స్ చేసింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 ఈనెల 25న గువహతిలో జరుగుతుంది.
భారీ ఛేదనలో రెండు ఓవర్లు కూడా కాకముందే (6/2తో) ఓపెనర్లిద్దరినీ కోల్పోయిన టీమ్ఇండియా.. ఛేదనను పూర్తిచేయగలిగిందంటే అది ఇషాన్ ఆడిన తుఫాన్ ఇన్నింగ్సే. బంతి దొరికితే బౌండరీ లైన్ దాటించడమే లక్ష్యంగా అతడి ఇన్నింగ్స్ సాగింది. ఫోక్స్ 3వ ఓవర్లో మూడు బౌండరీలు, ఓ సిక్సర్‌తో వేట మొదలెట్టిన ఇషాన్.. ఉన్నంతసేపూ అదే దూకుడును కొనసాగించాడు. శాంట్నర్ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదడంతో భారత్ 4.5 ఓవర్లకే 50 రన్స్ మార్కును చేరింది.
హెన్రీ వేసిన ఆరో ఓవర్లో 6,4తో 21 బంతుల్లోనే ఇషాన్ అర్ధ శతకం పూర్తయింది. ఇషాన్ వీరవిహరంతో 7.5 ఓవర్లలోనే భారత్ వంద పరుగుల మైలురాయిని దాటింది. క్రీజులో కుదురుకునేదాకా ఇషాన్‌కు స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆడిన సూర్య.. 8వ ఓవర్ తర్వాత జూలు విదిల్చాడు. ఫోక్స్ వేసిన 9వ ఓవర్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 25 రన్స్ రాబట్టాడు. ధాటిగా ఆడే క్రమంలో ఇషాన్.. సోధి వేసిన పదో ఓవర్లో హెన్రీకి క్యాచ్ ఇవ్వడంతో 122 పరుగుల (48 బంతుల్లోనే) మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. సగం ఇన్నింగ్స్ ముగిసేసరికి భారత్ 133/3తో పటిష్ట స్థితిలో నిలిచింది.
ఇషాన్ నిష్క్రమించినా అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న సూర్య.. డఫ్ఫీ 11వ ఓవర్లో 6, ఆ తర్వాత సింగిల్‌తో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. సుమారు 15 నెలల (23 ఇన్నింగ్స్‌ల తర్వాత.. చివరిసారిగా 2024 అక్టోబర్‌లో) తర్వాత అతడికి ఇదే తొలి ఫిఫ్టీ. అర్ధ శతకం తర్వాత బీస్ట్ మోడ్‌లోకి వచ్చిన ‘మిస్టర్ 360’.. తనదైన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. దూబెతో కలిసి నాలుగో వికెట్‌కు 37 బంతుల్లోనే అజేయంగా 81 రన్స్ జోడించాడు. ఇషాన్, సూర్య, దూబె జోరుతో భారత్.. మరో 28 బంతులు మిగిలుండగానే భారీ లక్ష్యాన్ని పూర్తిచేసింది.
భారత్ ఆహ్వానం మేరకు ముందు బ్యాటింగ్ చేసిన కివీస్ ఆరంభం నుంచే దంచుడు మంత్రాన్ని జపించింది. బుమ్రా లేని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దాదాపు క్రీజులోకి వచ్చినవారంతా సమష్టిగా బాదడంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది. అర్ష్‌దీప్ తొలి ఓవర్లో కాన్వే (19).. 4, 4, 6, 4తో బాదుడుకు శ్రీకారం చుడితే అతడే వేసిన 3వ ఓవర్లో సీఫర్ట్ (24).. వరుసగా నాలుగు ఫోర్లు కొట్టాడు. రాణా ఓవర్లో కాన్వే, వరుణ్ బౌలింగ్‌లో సీఫర్ట్ నిష్క్రమించినా కివీస్ దూకుడు తగ్గలేదు. రచిన్ కూడా ఎడాపెడా బాదాడు.
మరో ఎండ్‌లో ఫిలిప్స్ (19) కూడా కుల్దీప్ 9వ ఓవర్లో 6, 4, 4 కొట్టినా ఐదో బంతికి హార్ధిక్ చేతికి చిక్కాడు. 10 ఓవర్లకు వంద పరుగుల మార్కును అందుకున్న పర్యాటక జట్టు.. రెండు ఓవర్ల వ్యవధిలో మిచెల్ (18), రచిన్ వికెట్లను కోల్పోయింది. చాప్మన్ (10) కూడా ఎక్కువసేపు నిలువలేకపోయాడు. కానీ ఆఖర్లో శాంట్నర్ దూకుడుగా ఆడాడు. అర్ష్‌దీప్ ఆఖరి ఓవర్లో ఫోక్స్ (15*) 6, 4తో ఆ జట్టు స్కోరును 200 దాటించాడు.
2 టీ20ల్లో 200+ టార్గెట్లను ఛేదించడం భారత్‌కు ఇది ఆరోసారి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (7 సార్లు) అగ్రస్థానంలో ఉంది.
న్యూజిలాండ్: 20 ఓవర్లకు 208/6 (మిచెల్ 47*, రచిన్ 44, కుల్దీప్ 2/35, దూబె 1/7);
భారత్: 15.2ఓవర్లకు 209/3 (సూర్య 82*, ఇషాన్ 76, సోధి 1/34, డఫ్ఫీ 1/38)