మన్సూరాబాద్, డిసెంబర్ 9: కంబోడియాలో ఈనెల 4 నుంచి 7 వరకు జరిగిన పారా ఏషియన్ చాంపియన్‌షిప్ త్రో బాల్ పోటీల్లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. భారత్ జట్టులో మన్సూరాబాద్, శైలజాపురి కాలనీలోని దివ్యాంగుల హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న గోనె చింటూరెడ్డి సభ్యుడిగా ఉన్నాడు. భారత్ స్వర్ణం గెలవడంలో అతడు కీలకభూమిక పోషించాడు.
గత పదేండ్లుగా దివ్యాంగుల హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఆటల్లో తనకున్న మక్కువతో ఎన్నో అడ్డంకులను అధిగమించి దేశానికి ప్రాతినిథ్యం వహించే స్థాయికి ఎదిగిన చింటూరెడ్డి.. టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినట్టు విద్యార్థులు తెలిపారు.
చింటూరెడ్డి వంటి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించలేకపోయిందని, అయి నా నిరాశ చెందకుండా అతడు తన సొంతడబ్బుతో కంబోడియా వెళ్లాడని చెప్పారు. పారా ఏషియన్ సెక్రటరీ వివేషన్ చేతులమీదుగా చింటూరెడ్డి ప్రశంసాపత్రాన్ని, మెడల్‌ను అందుకున్నారు.