HomeSportsIndia Wins First Blind Womens T20 World Cup
ప్రపంచాన్ని జయించారు.. అంధుల వరల్డ్‌కప్‌లో అతివల అద్భుత ప్రతిభ
అమ్మాయిలు అద్భుతం చేశారు! మనసు పెట్టి ఆడితే సాధించలేనిది ఏది లేదని చేతల్లో చూపెట్టారు. తాము ఎవరికి తీసిపోమన్న రీతిలో అరంగేట్రం అంధుల టీ20 క్రికెట్ ప్రపంచకప్‌లో కొత్త చరిత్ర లిఖించారు.
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : అమ్మాయిలు అద్భుతం చేశారు! మనసు పెట్టి ఆడితే సాధించలేనిది ఏది లేదని చేతల్లో చూపెట్టారు. తాము ఎవరికి తీసిపోమన్న రీతిలో అరంగేట్రం అంధుల టీ20 క్రికెట్ ప్రపంచకప్‌లో కొత్త చరిత్ర లిఖించారు. ఈ లోకాన్ని కనులారా చూసే భాగ్యం లేకపోయినా..మనోనేత్రంతో ప్రపంచాన్ని జయించారు. ప్రతిభకు వైకల్యం అడ్డంకి కాదని నిరూపిస్తూ ప్రపంచకప్ ట్రోఫీని సగర్వంగా ముద్దాడారు. ఇటీవల అమ్మాయిల వన్డే ప్రపంచకప్ టోర్నీ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ తమ కలల కప్‌ను అందుకున్నారు. అంధత్వంతో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వెరువకుండా ఒక్కో మెట్టు ఎదుగుతూ దేశ ప్రధాని మొదలు పలువురి ప్రముఖల ప్రశంసలు పొందారు.
ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో నేపాల్‌ను చిత్తుచేస్తూ శ్రీలంక గడ్డపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించారు. మెగాటోర్నీ గెలిచి సొంతగడ్డపై అడుగుపెట్టిన భారత మహిళల జట్టుకు ఘన స్వాగతం లభించింది. అంచనాలకు మించి రాణించిన అమ్మాయిలకు ఆత్మీయ సన్మానం చేశారు. అయితే ఈ విజయ ప్రస్థానంలో ఒక్కోక్కరిది ఒక్కో పాత్ర. మెగాటోర్నీలో జట్టును ముందుండి నడిపించడంలో కర్ణాటకకు చెందిన దీపికది కీలక భూమిక అయితే అనెకా దేవి(జమ్మూ కశ్మీర్), ఫూల సరేన్(ఒడిశా), గంగా కదమ్(మహారాష్ట్ర) తమదైన పాత్ర పోషించారు.
కెప్టెన్ దీపిక:
మెగాటోర్నీలో భారత జట్టుకు కర్ణాటకకు చెందిన దీపిక టీసీ కెప్టెన్‌గా వ్యవహరించింది. సహచరుల్లో స్ఫూర్తి నింపుతూ జట్టును ముందుకు నడిపించింది. దీపికది భిన్నమైన నేపథ్యం. పసిప్రాయంలో జరిగిన ప్రమాదంలో చూపు కోల్పోయింది. రైతు కుటుంబానికి చెందిన దీపిక చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. క్రికెట్‌పై ఉన్న మక్కువతో అడ్డంకులను అధిగమిస్తూ భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించే స్థాయికి ఎదిగింది. ప్రత్యేకమైన పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఒక్కో మెట్టు ఎదిగిన దీపిక లక్ష్యం వైపు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసింది.
వైస్ కెప్టెన్ గంగ:
టీమ్ఇండియా వైస్ కెప్టెన్ గంగా కదమ్ స్వస్థలం మహారాష్ట్ర. మొత్తం తొమ్మిది తోబుట్టువుల్లో గంగ ఒకరు. కూతురు మెరుగైన భవిష్యత్ కోసం రైతు అయిన తండ్రి..అంధుల స్కూల్లో చేర్పించాడు. ఇక్కణ్నుంచే గంగ క్రికెట్లో ఓనమాలు నేర్చుకుంది. మొదట్లో ఏదో సరదాగా ఆడిన గంగ.. ఆ తర్వాత మెంటార్ సలహాతో కెరీర్‌ను సీరియస్‌గా తీసుకుంది. బంతి శబ్దాన్ని అంచనా వేయడంతో పాటు మెరుగైన టైమింగ్ కోసం తీవ్రంగా శ్రమించింది.
అనెకా దేవి @ కశ్మీర్
టీమ్ఇండియా టాపార్డర్ బ్యాటర్ అనెకా దేవి జమ్ము కశ్మీర్‌కు చెందిన అమ్మాయి. పుట్టుకతోనే పాక్షిక అంధత్వంతో జన్మించిన అనెకా దేవి..తన బధిర అంకుల్ ఇచ్చిన సలహాతో క్రికెట్లోకి ప్రవేశించింది. ఢిల్లీలోని ఓ స్కూల్లో జరిగిన అంధుల క్రికెట్ క్యాంప్ ద్వారా దేవి తన ప్రతిభ చాటుకుంది. శబ్దాలను నిశితంగా పరిశీలిస్తూ మెరుగైన టెక్నిక్‌ను అందిపుచ్చుకున్న ఈ 20 ఏండ్ల కశ్మీర్ అమ్మాయి అద్భుత ప్రతిభతో కోచ్‌లను ఆశ్చర్యపరిచింది. రెండేండ్ల వ్యవధిలోనే జాతీయ జట్టులోకి దూసుకొచ్చింది.
ఫూలా సరేన్:
ఒడిశాలోని మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన 18 ఏండ్ల ఫూలా సరేన్ ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకుంది. ఐదేండ్ల వయసులోనే ఎడమ కంటి చూపు కోల్పోయిన సరేన్..స్కూల్లో టీచర్ సహాయంతో క్రికెట్లోకి వచ్చింది. తన తల్లి కూడా అంధురాలు కావడంతో సరేన్ కష్టాలు రెట్టింపయ్యాయి. టోర్నీలకు వెళ్లడం సరేన్ కుటుంబానికి చాలా కష్టమైంది. ప్రపంచకప్ విజయంతో ఆమె కెరీర్ కీలక మలుపు తిరుగడంతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.