జకార్తా: హాకీ ఆసియా కప్‌లో భారత పురుషుల జట్టు కాంస్యం కొల్లగొట్టింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. ఫైనల్‌కు అర్హత సాధించలేకపోగా.. బుధవారం మూడో స్థానం కోసం జరిగిన పోరులో 1-0తో జపాన్ను మట్టికరిపించింది. మ్యాచ్ ఏడో నిమిషంలో భారత్ తరఫున రాజ్‌కుమార్ పాల్ ఏకైక గోల్ సాధించగా.. ఆ తర్వాత ప్రత్యర్థి ప్రయత్నాలను మన డిఫెండర్లు చక్కగా అడ్డుకున్నారు. సూపర్-4 స్టేజ్‌లో భాగంగా మంగళవారం దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌ను మనవాళ్లు 4-4తో ‘డ్రా’ చేసుకున్నా.. మెరుగైన గోల్స్ తేడాతో కొరియా ఫైనల్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఫైనల్లో దక్షిణ కొరియా 2-1 తేడాతో మలేషియాను మట్టికరిపించి పసిడి పతకం కైవసం చేసుకుంది.