చెన్నై: ప్రతిష్టాత్మక హాకీ జూనియర్ ప్రపంచకప్‌లో భారత్‌కు కాంస్యం దక్కింది. బుధవారం ఆఖరి వరకు అర్జెంటీనాతో హోరాహోరీగా సాగిన పోరులో భారత్ 4-2తో అద్భుత విజయం సాధించింది. చివరిసారి 2016(లక్నో)లో టైటిల్ గెలిచిన భారత యువ జట్టు ఆ తర్వాత పోడియం ఫినిష్ చేయలేకపోయింది. 2021 (భువనేశ్వర్)తో పాటు, 2023 (కౌలాలంపూర్)లో నాలుగో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. చివరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన కాంస్య పోరులో టీమ్ఇండియా తరఫున అంకిత్పాల్(49ని), మన్మీత్సింగ్(52ని), శారదానంద్ తివారీ(57ని), అన్మోల్ ఎక్కా(58ని) గోల్స్ చేయగా,నికోలస్ రోడ్రిగెజ్(3ని), సాంటియాగో ఫెర్నాండెజ్(44ని) అర్జెంటీనాకు గోల్స్ అందించారు. మ్యాచ్ విషయానికొస్తే తొలి రెండు క్వార్టర్లు భారత్‌పై అర్జెంటీనా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
మ్యాచ్ మొదలైన మూడో నిమిషానికే అన్మోల్ ఎక్కా చేసిన తప్పిదంతో దక్కిన పెనాల్టీ స్ట్రోక్ అవకాశాన్ని రోడ్రిగెజ్ గోల్ చేయడంతో అర్జెంటీనా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా అర్జెంటీనా దాడులు చేయడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. 20వ నిమిషంలో దిల్రాజ్సింగ్ చేసిన గోల్ ప్రయత్నాన్ని అర్జెంటీనా గోల్‌కీపర్ జ్వాకిన్ రుయిజ్ అడ్డుకోవడంతో అది సాధ్యపడలేదు. అయితే మూడో క్వార్టర్ నుంచి టీమ్ఇండియా మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు ప్రయత్నించింది.
31వ నిమిషంలో వరుసగా వచ్చిన నాలుగు పెనాల్టీ కార్నర్ అవకాశాలను భారత్ గోల్స్‌గా మలువలేకపోయింది. మరో ఎండ్‌లో 37వ నిమిషంలో తమకు దక్కిన పెనాల్టీ కార్నర్‌ను గోల్ చేసిన అర్జెంటీనా ఆధిక్యాన్ని 2-0కు పెంచుకుంది. ఆఖరిదైన నాలుగో క్వార్టర్లో అన్మోల్ ఫ్లిక్‌ను అంకిత్పాల్ గోల్ చేయడంతో భారత్ ఖాతా తెరిచింది. నాలుగు నిమిషాల తేడాతో మన్మీత్సింగ్ కొట్టిన పెనాల్టీతో స్కోరు 2-2తో సమమైంది. అయితే అదే దూకుడు కొనసాగిస్తూ ఆఖర్లో శారదానంద్, అన్మోల్ వరు గోల్స్ కొట్టడంతో భారత్‌కు చిరస్మరణీయ విజయం సాధించింది.
జూనియర్ ప్రపంచకప్ టోర్నీని జర్మనీ రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి కైవసం చేసుకుంది. ఫైనల్లో జర్మనీ 3-2తో స్పెయిన్‌పై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1తో సమం కావడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది.