సిడ్నీ: ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) ఆధ్వర్యంలో జరిగే ఏఎఫ్సీ మహిళల ఆసియా కప్ టోర్నీ చరిత్రలో తొలిసారిగా బెర్తును ఖాయం చేసుకున్న భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు.. వచ్చే ఏడాది జరుగబోయే 2026 ఉమెన్స్ ఏఎఫ్సీ ఆసియా కప్ పోటీల్లో గ్రూప్-సీలో నిలిచింది. సిడ్నీలోని టౌన్ హాల్లో నిర్వహించిన డ్రా కార్యక్రమంలో భారత్.. జపాన్, వియత్నాం, చైనీస్ తైఫీతో కలిసి గ్రూప్-సీలో ఉంది. 12 జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి.
ఫిఫా ర్యాంకుల ఆధారంగా జట్లకు సీడింగ్ ఇవ్వగా.. గ్రూప్-సీలో జపాన్ (7వ స్థానం), వియత్నాం (37), చైనీస్ తైఫీ (42), భారత్ (70) కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. జూలై 19 నుంచి 23 దాకా నిర్వహించిన క్వాలిఫయర్స్‌లో తమకంటే మెరుగైన ర్యాంకు కల్గిన థాయ్‌లాండ్‌ను ఓడించడంతో భారత్‌కు ఈ టోర్నీకి అర్హత సాధించింది. గత ఎడిషన్ భారత్‌లోనే నిర్వహించగా.. ఆతిథ్య దేశం కావడంతో అప్పుడు మన జట్టు ఆ కోటాలో ఈ టోర్నీలో పాల్గొంది.