(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులు ఒకప్పుడు ఎక్కువగా ఉండేవారు. అయితే, గడిచిన రెండేండ్లలో ఈ విషయంలో భారీ తగ్గుదల నమోదైంది. 2023లో ఉన్నత విద్య కోసం 9.08 లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళ్లగా, 2024నాటికి ఇది 7.7 లక్షలకు, 2025 నాటికి 6.26 లక్షలకు తగ్గింది. మొత్తంగా గడిచిన రెండేండ్లలో విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 31 శాతం మేర క్షీణించింది.
ఈ మేరకు గురువారం రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ సమాధానమిచ్చారు. హెచ్1బీ వీసా, అక్రమ వలసలు, సోషల్మీడియా వెట్టింగ్ పేరిట భారతీయులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా భారతీయుల వలసలపై పలు నిబంధనలు తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.