Women’s World Cup | మహిళల వన్డే ప్రపంచ కప్ చివరి దశకు చేరుకుంది. ఫైనల్లో భారత-దక్షిణాఫ్రికా జట్లు మరికొద్ది గంట్లో తలపడబోతున్నాయి. నవీ ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది. ఇప్పటి వరకు రెండు జట్లు ఐసీసీ వరల్డ్ కప్ టైటిల్‌ను గెలువలేదు. ఈ సారి కొత్త జట్టు చాంపియన్‌గా నిలువబోతున్నది.
సెమీఫైనల్లో రెండు జట్లు కఠినమైన సవాల్‌ను ఎదుర్కొన్నాయి. భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్స్‌కు అంత సులభంగా ఏమీ చేరుకోలేదు. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా ఇంగ్లండ్‌తో తలపడగా.. భారత జట్టు ఆస్ట్రేలియాను ఢీకొట్టింది. ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కొంది. ఆసక్తికరంగా గ్రూప్ దశలో ఇంగ్లండ్.. దక్షిణాఫ్రికాను ఓడించినట్లే, ఆస్ట్రేలియా జట్టు గ్రూప్ దశలో భారత్‌ను ఓడించింది. అయినా, భారత్, దక్షిణాఫ్రికా జట్టు మనోధైర్యం కోల్పోకుండా.. ఆ రెండు జట్లను సెమీస్‌లో ఓడించి టైటిల్ మ్యాచ్‌లోకి అడుగుపెట్టాయి. రెండు జట్లు టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచాయి.
2025 మహిళల ప్రపంచ కప్‌లో భారతదేశం, దక్షిణాఫ్రికా ప్రయాణాన్ని చూస్తే.. గ్రూప్ దశలో రెండు జట్లు మంచి ప్రదర్శన ఇచ్చాయి. దక్షిణాఫ్రికా ఏడు మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచింది. ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆతిథ్య భారతదేశం ఏడు మ్యాచ్‌ల్లో ఏడు పాయింట్లతో నాల్గవ స్థానంలో నిలిచింది. మూడు మ్యాచుల్లో గెలిచి, మూడింట్లో ఓడి, ఒక డ్రాతో సెమీఫైనల్లో చోటు దక్కించుకుంది.
వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో శ్రీలంకను 59 పరుగుల తేడాతో ఓడించి భారత జట్టు ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో వారు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 88 పరుగుల తేడాతో ఓడించారు. వరుసగా రెండు విజయాలు సాధించిన భారత జట్టు ఆ తర్వాత హ్యాట్రిక్ పరాజయాలను చవిచూసింది. దాంతో ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రయాణం ముగిసిందనే భావించారు. వాస్తవానికి ఆదివారం ఫైనల్ ఆడనున్న దక్షిణాఫ్రికా జట్టుతో భారత్ మొదట మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత, ఆస్ట్రేలియా చేతిలో మూడు వికెట్ల తేడాతో, ఇంగ్లాండ్ చేతిలో నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయారు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం భారత్‌కు చాలా కీలకమైంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు వర్చువల్ నాకౌట్ లాంటిది. స్మృతి మంధాన, ప్రతికా రావల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత జట్టు న్యూజిలాండ్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో డీఎల్ఎస్ ద్వారా 53 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్లోకి చేరుకుంది. ఆ తర్వాత మరో గ్రూప్ దశ మ్యాచ్ బంగ్లాదేశ్‌తో జరిగింది. ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.
దక్షిణాఫ్రికాకు ప్రపంచకప్ ఆరంభంలో నిరాశ కలిగించింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది ప్రొటీస్ జట్టు. అయితే, ఆ తర్వాత జట్టు బలమైన పునరాగమనం చేసి వరుసగా ఐదు మ్యాచ్‌లను గెలుచుకుంది. దక్షిణాఫ్రికా న్యూజిలాండ్‌ను ఆరు వికెట్ల తేడాతో, భారత్‌ను మూడు వికెట్ల తేడాతో, బంగ్లాదేశ్‌ను మూడు వికెట్ల తేడాతో, శ్రీలంకను డీఎల్ఎస్ ద్వారా పది వికెట్ల తేడాతో, పాకిస్తాన్‌ను 150 పరుగుల తేడాతో ఓడించింది. గ్రూప్ దశలోని చివరి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాతో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటికి కూడా ఆ జట్టు ధైర్యం సడలలేదు. సెమీ-ఫైనల్స్‌లో ప్రారంభ మ్యాచ్‌లో దారుణంగా ఓడించిన ఇంగ్లండ్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది.
మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో భారత్, దక్షిణాఫ్రికా జట్టు ఇప్పటి వరకు పోటీపడలేదు. కానీ, మహిళల ప్రపంచ కప్‌లో రెండు జట్లు ఆరుసార్లు తలపడ్డాయి. రెండు జట్లు ఒకదానికొకటి మూడుసార్లు గెలిచాయి. ఈ టోర్నమెంట్ లో రెండుజట్లు సమానంగానే ఉన్నాయి. 1997 లో తొలిసారి రెండు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో టీమిండియా దక్షిణాఫ్రికాను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో కూడా భారత్ ఆధిపత్యం చెలాయించింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఆ మ్యాచ్‌లో గెలిచింది. 2005లో కూడా దక్షిణాఫ్రికాను నాలుగు వికెట్ల తేడాతో భారత్ ఓడించింది.
1997 నుంచి 2005 వరకు జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్ మూడుసార్లు దక్షిణాఫ్రికాను ఓడించింది. 2017 నుంచి 2025 వరకు మ్యాచుల్లో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. మూడు మ్యాచుల్లో టీమిండియా ఓటమిపాలైంది. 2017లో దక్షిణాఫ్రికా 115 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించగా, 2022లో మూడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా వారిని ఓడించింది. ప్రస్తుత వరల్డ్ కప్‌లో గ్రూప్ దశలో దక్షిణాఫ్రికా జట్టు భారత్‌పై విజయం నమోదు చేసింది.