టీమ్ఇండియా మారలేదు! సొంతగడ్డపై స్పిన్‌ను ఆడటంలో సుదీర్ఘ అనుభవమున్న భారత్.. మరోసారి స్పిన్ తంత్రంలోనే చిక్కుకుని అవమాన కరమైన ఓటమిని చవిచూసింది. సరిగ్గా ఏడాది క్రితం స్వదేశంలో న్యూజిలాండ్, భారత జట్టును స్పిన్ తంత్రంతోనే చుట్టేసి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఉదంతాన్ని గుర్తుకుతెస్తూ.. దక్షిణాఫ్రికా సైతం అదే మాయతో ఆతిథ్య జట్టుకు తొలి టెస్టులో అనూహ్య షాకిచ్చింది. సఫారీ స్పిన్నర్ల మాయకు 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక భారత బ్యాటింగ్ దళం నానా తంటాలు పడింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఈనెల 22 నుంచి గువహతి వేదికగా జరుగనుంది.
కోల్‌కతా: స్వదేశంలో బెబ్బులిలా గర్జించే భారత జట్టుకు కొట్టిన పిండి అయిన ఈడెన్ గార్డెన్స్‌లో ఊహించని షాక్ తగిలింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) డిఫెండింగ్ చాంపియన్ అయిన దక్షిణాఫ్రికాతో మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో టీమ్ఇండియా 30 పరుగుల తేడాతో అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. పర్యాటక జట్టు నిర్దేశించిన 124 పరుగుల స్వల్ప ఛేదనలో మెన్ ఇన్ బ్లూ.. 35 ఓవర్లలో 93 పరుగులకే చేతులెత్తేసి ఘోర పరాభవం వైపు నిలిచారు. సఫారీల తురుపుముక్క, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సైమన్ హర్మర్ (4/21) ఆఫ్ స్పిన్ మాయాజాలానికి తోడు కేశవ్ మహారాజ్ (2/37), పేసర్ మార్కో యాన్సెన్ (2/15) ధాటికి భారత బ్యాటర్లు క్రీజులో నిలిచేందుకు నానా తంటాలు పడ్డారు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా.. కెప్టెన్ టెంబా బవుమా (136 బంతుల్లో 55 నాటౌట్, 4 ఫోర్లు) అజేయ అర్ధ శతకంతో ఆ జట్టుకు పోరాడే స్కోరును అందించాడు.
లక్ష్యం పెద్దదేమీ కాకున్నా స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్‌పై 124 రన్స్ ఛేదించడమూ టీమ్ఇండియాకు శక్తికి మించిన పనే అయింది. తొలి ఓవర్ నుంచే మొదలైన వికెట్ల పతనానికి ఎక్కడా అడ్డుకట్ట పడలేదు. మొదట్లో పేసర్ యాన్సెన్ పేస్ పదునుకు ఓపెనర్లిద్దరూ దారుణంగా విఫలమైతే హర్మర్ మిడిలార్డర్‌ను ఆటాడించాడు. వాషింగ్టన్ సుందర్ (92 బంతుల్లో 31, 2 ఫోర్లు) మినహా మిగిలినవారెవరూ నిలకడగా కనీసం 35 బంతులపాటు క్రీజులో నిలువలేకపోయారు. యాన్సెన్ వేసిన మొదటి ఓవర్లోనే జైస్వాల్.. కీపర్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. మూడో ఓవర్లో అతడు రాహుల్‌నూ అదే రీతిలో పెవిలియన్‌కు పంపడంతో భారత జట్టు 10/2తో భోజన విరామానికి వెళ్లింది.
లంచ్ తర్వాత జురెల్ (34 బంతుల్లో 13), వాషింగ్టన్ 12 ఓవర్ల పాటు క్రీజులో నిలబడ్డా స్కోరుబోర్డు మాత్రం నెమ్మదిగానే కదిలింది. లంచ్ అనంతరం తన ఐదో ఓవర్లో హర్మర్.. జురెల్‌ను ఔట్ చేసి 32 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. ఇక ఆ తర్వాత వచ్చినోళ్లు వచ్చినట్టు పెవిలియన్‌కు క్యూ కట్టారు. గిల్ గైర్హాజరీలో స్టాండ్ ఇన్ కెప్టెన్ రిషభ్ పంత్ (2).. హర్మర్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చాడు. ఆదుకుంటాడనుకున్న జడేజా (18) కూడా హర్మర్కు వికెట్ల ముందు దొరికిపోయాడు. క్రీజులో ఒంటరిపోరాటం చేసిన వాషింగ్టన్‌ను పార్ట్ టైమ్ స్పిన్నర్ మార్క్మ్ బోల్తా కొట్టించడంతో భారత ఓటమి దాదాపుగా ఖరారైంది.
భారత స్కోరు 77/7తో ఉన్న దశలో అక్షర్ పటేల్ (26) క్రీజులో ఉండటంతో భారత అభిమానులు ధీమాగానే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే అతడు.. మహారాజ్ వేసిన 35వ ఓవర్లో 4, 6, 6 బాదాడు. కానీ అదే ఓవర్లో ఐదో బంతికి బవుమాకు క్యాచ్ ఇవ్వడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. ఆరో బంతికి మహారాజ్.. సిరాజ్నూ ఔట్ చేసి 15 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత దక్షిణాఫ్రికాకు భారత్‌లో తొలి టెస్టు విజయాన్ని ఖాయం చేశాడు.
ఓవర్ నైట్ స్కోరు 93/7తో మూడో రోజు క్రీజులోకి వచ్చిన సౌతాఫ్రికాను బవుమా ఆదుకున్నాడు. పట్టుదలగా బ్యాటింగ్ చేసిన అతడికి బాష్ (25) మంచి సహకారం అందించాడు. ఈ జోడీ 8వ వికెట్‌కు 44 రన్స్‌ను జోడించి ఆ జట్టు ఆధిక్యాన్ని వంద పరుగులు దాటించింది. ఈ భాగస్వామ్యమే భారత్‌ను దెబ్బతీసింది. బుమ్రా ఎట్టకేలకు బాష్‌ను బౌల్డ్ చేశాడు. అతడే వేసిన ఓవర్లో బౌండరీతో బవుమా హాఫ్ సెంచరీ పూర్తైంది. సిరాజ్ ఒకే ఓవర్లో హర్మర్ (18), మహారాజ్‌ను ఔట్ చేసి సఫారీ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
1 భారత్‌లో భారత్‌ను ఓడించడం (టెస్టుల్లో) దక్షిణాఫ్రికాకు 2010 తర్వాత ఇదే ప్రథమం. 15 ఏండ్ల క్రితం ఆ జట్టు నాగ్‌పూర్ టెస్టులో ఆతిథ్య జట్టును ఓడించింది.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 159 ఆలౌట్; భారత్ తొలి ఇన్నింగ్స్: 189 ఆలౌట్;
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 153 ఆలౌట్ (బవుమా 55*, బాష్ 25, జడేజా 4/50, సిరాజ్ 2/2);
భారత్ రెండో ఇన్నింగ్స్: 35 ఓవర్లలో 93 ఆలౌట్ (వాషింగ్టన్ 31, అక్షర్ 26, హర్మర్ 4/21, యాన్సెన్ 2/15)