Champions Trophy | లాహోర్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌తో తలపడే ప్రత్యర్థి తేలిపోయింది. లాహోర్ వేదికగా ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించి టీమ్ఇండియాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల రికార్డు (ఈ టోర్నీలో ఇదే అత్యుత్తమం) స్కోరు చేసింది. అద్భుత ఫామ్‌లో ఉన్న రచిన్ రవీంద్ర (101 బంతుల్లో 108, 13 ఫోర్లు, 1 సిక్స్), కేన్ విలియమ్సన్ (94 బంతుల్లో 102, 10 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాలతో చెలరేగారు. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా.. 312/9 వద్దే ఆగిపోయింది. డేవిడ్ మిల్లర్ (67 బంతుల్లో 100 నాటౌట్, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు శతకంతో మెరిసినా వాన్‌డర్ డసెన్ (66 బంతుల్లో 69, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బవుమా (71 బంతుల్లో 56, 4 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా సఫారీలను విజయతీరాలకు చేర్చలేదు. కివీస్ సారథి మిచెల్ శాంట్నర్ (3/43) సఫారీలను కట్టడి చేశాడు. రచిన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శాంట్నర్ నమ్మకాన్ని నిలబెడుతూ కివీస్ ఓపెనర్లు రచిన్, యంగ్ (21) ఆ జట్టుకు మంచి ఆరంభమే అందించారు. ఆ జట్టు 48 పరుగుల వద్ద ఎంగిడి.. యంగ్‌ను ఔట్ చేయడంతో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. కానీ ఆ తర్వాత సఫారీ బౌలర్లు వికెట్ తీయడానికి సుమారు 25 ఓవర్లు వేచి చూడాల్సి వచ్చింది. యంగ్ స్థానంలో వచ్చిన విలియమ్సన్తో కలిసి రచిన్ రవీంద్ర సఫారీ బౌలర్లను ఆటాడుకున్నాడు. ఎంగిడి, రబాడా, మహారాజ్, జాన్సెన్ను దీటుగా ఎదుర్కున్నాడు. 93 బంతుల్లో తన కెరీర్లో ఐదో శతకాన్ని అందుకున్న రచిన్‌ను రబాడా పెవిలియన్‌కు పంపడంతో 164 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 40వ ఓవర్లో విలియమ్సన్ వన్డేలలో 15వ శతకాన్ని నమోదుచేశాడు. అదే ఓవర్లో అతడు నిష్క్రమించినా ఆఖర్లో మిచెల్ (49), ఫిలిప్స్ (49 నాటౌట్) ధాటిగా ఆడటంతో కివీస్ భారీ స్కోరు సాధించింది.
భారీ ఛేదనలో సౌతాఫ్రికా 5వ ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. కానీ బవుమా, డసెన్ పోరాటం ఆ జట్టుకు ఆశలు కల్పించింది. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. అయితే కివీస్ సారథి శాంట్నర్.. సఫారీలను కోలుకోలేని దెబ్బకొట్టాడు. 23వ ఓవర్లో బవుమాను ఔట్ చేసిన అతడు.. 27వ ఓవర్లో డసెన్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. తన తర్వాతి ఓవర్లో అతడు.. ప్రమాదకర క్లాసెన్ (3)ను ఔట్ చేయడంతో సఫారీల ఆశలు ఆవిరయ్యాయి. మార్క్మ్ (31) నిరాశపరిచినా ఆఖర్లో మిల్లర్ పోరాటం దక్షిణాఫ్రికా ఓటమి అంతరాన్ని తగ్గించినా అతడి ఇన్నింగ్స్ మాత్రం ప్రేక్షకులను అలరించింది.
ఈనెల 9న దుబాయ్‌లో జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి సెమీస్‌లో టీమ్ఇండియా.. ఆస్ట్రేలియాను ఓడించగా కివీస్.. సౌతాఫ్రికాను చిత్తుచేసి టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఈ రెండు జట్లూ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా 2000 ఎడిషన్ తుదిపోరులో ముఖాముఖి తలపడగా అందులో కివీస్‌దే పైచేయి అయింది. 2021 ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ భారత్‌కు పరాభవం తప్పలేదు. 2019 వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ పోరు సందర్భంగా ధోనీ రనౌట్ ఇప్పటికీ భారత అభిమానులకు మరిచిపోలేని పీడకలే. మరి దుబాయ్‌లో అదృష్టం ఎవరిని వరించేనో?
న్యూజిలాండ్: 50 ఓవర్లలో 362/6 (రచిన్ 108, విలియమ్సన్ 102, ఎంగిడి 3/72, రబాడా 2/70); దక్షిణాఫ్రికా: 50 ఓవర్లలో 312/9 (మిల్లర్ 100 నాటౌట్, డసెన్ 69, శాంట్నర్ 3/43, ఫిలిప్స్ 2/27)