చెన్నై: సొంతగడ్డపై పటిష్ట ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను అదిరిపోయే విజయంతో ఆరంభించిన యువ భారత జట్టు.. శనివారం రెండో పోరుకు సిద్ధమైంది. పొట్టి ఫార్మాట్లో వరల్డ్ చాంపియన్‌గా ఉన్న భారత జట్టు.. పటిష్ట ఇంగ్లీష్ జట్టును మరోసారి చిత్తుచేసి సిరీస్‌లో 2-0 ఆధిక్యం దక్కించుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. స్పిన్‌కు అనుకూలించే చెన్నై ఎం.ఏ. చిదంబరం స్టేడియం వేదికగా బట్లర్ గ్యాంగ్‌ను స్పిన్ ఉచ్చులో బంధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. సుమారు ఏడాదిన్నర విరామం తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన షమీకి ఈ మ్యాచ్‌లో అయిన తుది జట్టులో చోటు దక్కుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మొదటి టీ20లో బ్యాటింగ్ వైఫల్యంతో తేలిపోయిన ఇంగ్లండ్.. చెన్నైలో పుంజుకోవాలని చూస్తోంది.
సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత ఓపెనర్లుగా జట్టులోకి వచ్చిన అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఆరంభంలో మెరుపులు మెరిపిస్తున్న ఈ జోడీలో ఒకరు నిష్క్రమించినా మరొకరు భారీ షాట్లతో విరుచుకుపడుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపెడుతున్నారు. గత ఆరు ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు చేసిన శాంసన్.. కోల్‌కతాలో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించినా దానిని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. అభిషేక్.. ఈడెన్ గార్డెన్ జోరు కొనసాగిస్తే ఇంగ్లీష్ బౌలర్లకు బడిత పూజ తప్పదు.
కెప్టెన్ అయ్యాక స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోతున్న సూర్యకుమార్ యాదవ్.. పూర్వపు ఫామ్‌ను అందుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, నితీశ్రెడ్డితో భారత బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ కొత్తబంతితో నిప్పులు చెరుగుతున్నాడు. అతడికి షమీ కూడా తోడైతే భారత పేస్ విభాగం మరింత పటిష్టమవుతుంది. అయితే షమీ వస్తే తుది జట్టులో ఎవరిని పక్కనబెడతారనేది చూడాలి.