వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్నప్పటికీ మూడో టీ20లో బ్యాటింగ్ వైఫల్యంతో తడబడ్డ భారత్.. శుక్రవారం పుణె వేదికగా ఇంగ్లండ్‌తో జరగాల్సిన నాలుగో మ్యాచ్‌కు సిద్ధమైంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)లో జరుగబోయే ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను ఇక్కడే పట్టేయాలనే లక్ష్యంతో టీమ్ఇండియా బరిలోకి దిగుతోంది. రాజ్‌కోట్‌లో బౌలర్లు రాణించినా బ్యాటర్లు విఫలమవడంతో ‘మెన్ ఇన్ బ్లూ’ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కానీ పుణెలో మాత్రం ఆ తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకోవాలని సూర్యకుమార్ సేన భావిస్తోంది. మరోవైపు కోల్‌కతా, చెన్నైలలో ఓడినా రాజ్‌కోట్‌లో ఇంగ్లీష్ జట్టు బలంగా పుంజుకుంది. పుణెలోనూ సత్తా చాటి సిరీస్‌ను 2-2తో సమం చేసి ముంబైలో చివరి మ్యాచ్‌తో తాడోపేడో తేల్చుకోవాలని ఇంగ్లండ్ పట్టుదలతో ఉన్న నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మరో రసవత్తర పోరు జరిగే అవకాశముంది.
Team India | పుణె : టాపార్డర్‌లో ఓపెనర్ సంజూ శాంసన్, సారథి సూర్యకుమార్ యాదవ్ ఫామ్ భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. రాక రాక వచ్చిన అవకాశాలను గతేడాది పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌నకు ఓపెనర్‌గా స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడని భావించిన సంజూ.. తాజా సిరీస్‌లో గాడి తప్పుతున్నాడు. ఆర్చర్, వుడ్ విసిరే షార్ట్ పిచ్ బంతులను ఆడటంలో ఇబ్బందులు పడుతున్న ఈ కేరళ వీరుడు.. పుణెలో అయినా ఆ బలహీనతను అధిగమించాలని భారత్ కోరుకుంటోంది. ఈ సిరీస్‌లో (26, 5, 3 రన్స్) మూడుసార్లూ ఆర్చర్ వేసిన షార్ట్ బాల్స్‌కే శాంసన్ నిష్క్రమించాడు. పుణెలోనూ విఫలమైతే అతడి ఓపెనింగ్ స్థానంతో పాటు జట్టులో చోటూ ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. శాంసన్‌తో పాటు సారథి సూర్య కూడా ఈ సిరీస్‌లో ఘోరంగా విఫలమవుతున్నాడు. కోల్‌కతాలో డకౌట్ అయిన సూర్య.. చెన్నైలో 12 పరుగులే చేయగా రాజ్‌కోట్‌లో బాధ్యతాయుతంగా ఆడాల్సిన దశలోనూ అనవసర షాట్ ఆడబోయి 14 పరుగులకు వెనుదిరిగాడు. శుక్రవారం మ్యాచ్‌లో అయినా కెప్టెన్ విజృంభించకుంటే భారత్‌కు బ్యాటింగ్ తిప్పలు తప్పవు. గత మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన అభిషేక్, తిలక్ పుణెలో మెరుపులు మెరిపించాలని భారత్ కోరుకుంటోంది.
వెన్ను నొప్పి కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన రింకూ సింగ్.. పూర్తి ఫిట్ అయ్యాడు. పుణెలో అతడిని ఆడిస్తే జురెల్ బెంచ్‌కే పరిమితమవ్వొచ్చు. ఆల్‌రౌండర్ కోటాలో రమణ్‌దీప్ సింగ్, శివమ్ దూబెలలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్‌ను ఎదుర్కోవడంలో భారత మిడిలార్డర్ తంటాలు పడ్డ నేపథ్యంలో స్పిన్‌ను బాగా ఆడగలిగే దూబె వైపు టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపొచ్చు. ఇక గత మ్యాచ్‌లో ఆడలేకపోయిన అర్ష్‌దీప్‌ను పుణెలో ఆడించనున్నట్టు సమాచారం. అతడొస్తే ఎవరిని పక్కనపెడతారనేది ఆసక్తికరం.
తొలి రెండు మ్యాచ్‌లలో భారత స్పిన్‌కు కుదేలైన ఇంగ్లండ్.. రాజ్‌కోట్‌లో మాత్రం అదే స్పిన్‌తో సూర్య అండ్ కో.ను దెబ్బతీసి విజయవంతమైంది. ఓపెనర్ బెన్ డకెట్ గత మ్యాచ్‌లో వీరవిహారం చేయగా అతడు జోరు కొనసాగించాలని ఇంగ్లీష్ జట్టు కోరుకుంటోంది. కానీ మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ వరుసగా విఫలమవుతున్నాడు. బట్లర్ టచ్‌లోనే ఉన్నా బ్రూక్‌తో పాటు మిడిలార్డర్ బ్యాటర్లు భారత స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేక పెవిలియన్‌కు చేరుతున్నారు. గత మ్యాచ్‌లో లివింగ్స్టన్ కాస్త ప్రతిఘటించి ఆ జట్టుకు భారీ స్కోరునందించాడు.