బులవాయో: ప్రతిష్టాత్మక అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. శనివారం జరిగే తమ రెండో లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో యువ భారత్ తలపడనుంది. మెగాటోర్నీలో ఇప్పటికే అమెరికాపై ఘన విజయంతో బోణీ కొట్టిన భారత్..అదే ఊపులో బంగ్లాను చిత్తుచేసేందుకు తహతహలాడుతున్నది. వర్షం అంతరాయం మధ్య జరిగిన పోరులో అమెరికాపై టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యువ పేసర్ హెనిల్ పటేల్(5/16)..అమెరికా పతనంలో కీలకమయ్యాడు.
హెనిల్ ధాటికి అమెరికా 107 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాతో తదుపరి పోరులోనూ భారత్ సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటాలని చూస్తున్నది. యువ పేసర్లు హెనిల్ పటేల్, కిషన్కుమార్సింగ్, ఉద్దవ్ మోహన్‌తో టీమ్ఇండియా బలంగా కనిపిస్తున్నది. వీరికి తోడు కనిష్క్ చౌహాన్, మహమ్మద్ ఎనాన్ స్పిన్నర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలకమవుతున్నారు.
బ్యాటింగ్ విషయానికొస్తే కెప్టెన్ ఆయూశ్ మాత్రెకు జతగా 15 ఏండ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, కీపర్ అభిజ్ఞాన్ కుందు, ఆల్‌రౌండర్లు ఆరోన్ జార్జ్, వేదాంత్ త్రివేది బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఇదిలా ఉంటే గత 17 మ్యాచ్‌ల్లో 14 విజయాలు సాధించడం భారత్ సూపర్ ఫామ్‌ను సూచిస్తున్నది. జింబాబ్వేలోని పేస్ అనుకూల పరిస్థితుల్లో భారత పేసర్లు మరోమారు చెలరేగాలని చూస్తున్నారు.