Asia Cup 2023 | ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఇప్పటికే ఫైనల్‌కు అర్హత సాధించిన జట్టు ఓ వైపు..రెండింట్లోనూ పరాజయాలు మూటగట్టుకొని రేసు నుంచి నిష్క్రమించిన టీమ్ మరోవైపు!అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు ఫుల్ ఫామ్‌లో ఉన్న జట్టు ఒకవైపు..గాయాలకు తోడు నైరాశ్యంలో మునిగి ఉన్న టీమ్ మరోవైపు!! ఆసియాకప్‌లో నామమాత్ర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం ఫైనల్లో తలపడనున్న టీమ్ఇండియా అంతకుముందు నామమాత్ర పోరులో నేడు బంగ్లాదేశ్‌ను ఢీ కొట్టనుంది. కూర్పు సరిచూసుకునేందుకు రోహిత్ సేనకు ఇది చక్కటి అవకాశం కాగా.. మరోసారి మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండటం అభిమానులకు ఆందోళన కలిగించే అంశం.
కొలంబో: ఆసియాకప్‌లో మంచి జోరుమీదున్న భారత జట్టు శుక్రవారం నామమాత్రమైన పోరులో బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. సూపర్-4లో భాగంగా ఇప్పటికే పాకిస్థాన్, శ్రీలంకపై విజయాలు సాధించిన టీమ్ఇండియా తుదిపోరుకు దూసుకెళ్లగా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్ పైనల్ రేసు నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఫలితంపై పెద్దగా ఆసక్తి లేకపోయినా.. వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ఇంకా ఎక్కువ సమయంలో లేకపోవడంతో తుది జట్టు కూర్పు సరిచూసుకునేందుకు టీమ్ మేనేజ్మెంట్కు ఇది చక్కటి అవకాశం కానుంది. దాయాది పాకిస్థాన్‌తో వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన పోరులో మన బ్యాటర్లు శివతాండవమాడగా.. ఆనక బౌలర్లు కూడా దుమ్మురేపారు.
ఇక మరుసటి రోజే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లు పెద్దగా రాణించకపోయినా.. స్పిన్నర్లు సత్తాచాటడంతో భారత్ 4 పాయింట్లతో ఫైనల్‌కు చేరింది. మరోవైపు ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో పాటు ఉన్నవాళ్లు ఫామ్ అందిపుచ్చుకోలేక పోతుండడంతో బంగ్లాదేశ్ ఈ టోర్నీలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అలాంటిది స్టార్లతో నిండి ఉన్న టీమ్ఇండియాకు బంగ్లా టైగర్స్ ఏమాత్రం పోటీనిస్తారో చూడాలి. కాగా.. పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు ప్రధాన ఆటగాళ్లకు భారత్ విశ్రాంతినిచ్చే అవకాశాలను కొట్టి పారేయలేం. ముఖ్యంగా ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఈ మ్యాచ్‌కు రెస్ట్ ఇచ్చి అతడి స్థానంలో మహమ్మద్ షమీని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రావడంతో మేనేజ్మెంట్కు ప్రధాన చిక్కు వచ్చిపడింది. గత రెండు మ్యాచ్‌లకు శ్రేయస్ దూరం కాగా.. అతడి స్థానంలో ఆడిన రాహుల్ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అజేయ సెంచరీతో చెలరేగిన రాహుల్.. లంకపై కూడా విలువైన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. మరి వీరిద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.
తిలక్‌కు నిరీక్షణే!
వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ప్లేయర్లంతా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని చూస్తుండటంతో.. భారత్ తుది జట్టులో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. అంటే తెలంగాణ యువ కెరటం ఠాకూర్ తిలక్ వర్మకు ఇప్పట్లో వన్డే అరంగేట్రం చేసే చాన్స్ లేనట్లే. వెస్టిండీస్ పర్యటనలో పొట్టి ఫార్మాట్లో దంచికొట్టి.. సెలెక్టర్ల దృష్టిలో పడ్డ తిలక్ ఆ వెంటనే వన్డే పిలుపు అందుకున్నాడు. అయితే ఆసియాకప్‌నకు ముందు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కోలుకోవడంతో తిలక్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ తుది జట్టులో చోటు దక్కలేదు. బంగ్లాదేశ్ తో పోరు నామమాత్రమే కావడంతో అతడికి అవకాశమిస్తారా అంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో అది కష్టమే అనిపిస్తున్నది. మరో కీలక ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ టోర్నీలో ఇంతవరకు ఒక్క మ్యాచ్ ఆడలేదు. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్/రాహుల్, ఇషాన్, పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, సిరాజ్, బుమ్రా/షమీ.
బంగ్లాదేశ్: షకీబ్ (కెప్టెన్), మెహిది హసన్, తన్జిద్, లిటన్‌దాస్, తౌహిద్, అఫిఫ్, షమీమ్, నసుమ్, తస్కీన్, షరీఫుల్, మహమూద్.
పిచ్, వాతావరణం
ఆసియాకప్‌ను నీడలా వెంటాడుతున్న వరుణుడు ఈ మ్యాచ్‌ను కూడా వదిలేలా లేడు. శుక్రవారం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పిచ్ కాస్త స్లోగా ఉండనుంది. స్పిన్నర్లకు సహకారం లభించే చాన్స్ ఉంది.