BAN vs IND : రెండో టెస్టులో భారత్ విజయం ముంగిట నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సరికి ఇండియా 4 వికెట్లు కోల్పోయి 45 రన్స్ చేసింది. మరో 100 రన్స్ చేస్తే ఇండియా టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్లీప్ చేస్తుంది. నైట్వాచ్మెచ్ అక్షర్ పటేల్ 26, జయదేవ్ ఉనాద్కత్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. 145 టార్గెట్ .. చిన్నదే అయినప్పటికీ బంగ్లా బౌలర్లు పోరాడడంతో భారత్ రెండో ఓవర్లోనే రాహుల్ వికెట్ కోల్పోయింది. మెహిదీ హసన్ మిరాజ్ కీలకమైన పూజారా, గిల్, విరాట్ కోహ్లీ వికెట్లు పడగొట్టాడు. కేఎల్ రాహుల్ రెండో ఓవర్లో 2 పరుగులకే వెనుదిరిగి నిరాశ పరిచాడు. అడ్డుగా నిలుస్తాడనుకున్న పుజారా (6) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. తొలి టెస్టులో విఫలమైన కోహ్లీ ఈసారి కూడా బ్యాట్ ఝులిపించలేక పోయాడు. తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో రివ్యూతో బతికిపోయిన కోహ్లీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. 22 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. అక్షర్ పటేల్, ఉనాద్కత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.
మూడో రోజు ఓవర్‌నైట్ స్కోర్ 7/0 తో ఉన్న బంగ్లాదేశ్‌ను అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీసి దెబ్బతీశాడు. సిరాజ్, అశ్విన్ కూడా విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 231 రన్స్‌కే పరిమితమైంది. టెయిలెండర్లు నురుల్ హసన్ (31) , తస్కిన్ అహ్మద్ (31)తో కలిసి లిట్టన్ దాస్‌లు (73) బంగ్లా స్కోర్‌ను రెండొందలు దాటించాడు. రవిచంద్రన్ అశ్విన్, సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఉనాద్కత్, ఉమేశ్ యాదవ్‌కు చెరో వికెట్ దక్కింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 87 పరుగుల ఆధిక్యం లభించింది.