406 ఆస్ట్రేలియాపై టెస్టుల్లో భారత్‌కు ఇదే తొలి ఇన్నింగ్స్ అత్యుత్తమ స్కోరు. దీప్తిశర్మ, పూజ వస్ర్తాకర్ ఎనిమిదో వికెట్‌కు నెలకొల్పిన 122 పరుగుల భాగస్వామ్యం.. ఈ ఫార్మాట్లో బెస్ట్‌గా రికార్డు అయ్యింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఏకైక టెస్టు పోరు హోరాహోరీగా సాగుతున్నది. ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్న పోరులో ఆతిథ్య భారత్ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నది. సొంతగడ్డపై పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటూ స్నేహ్‌రానా, హర్మన్‌ప్రీత్‌కౌర్ విజృంభించడంతో కంగారూలు ఐదు వికెట్లు కోల్పోయారు. 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్న ఆసీస్..భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించేందుకు పట్టుదలతో ఉంది. దీప్తిశర్మ, పూజ వస్ర్తాకర్ రాణింపుతో టీమ్ఇండియా..ఆసీస్‌పై రికార్డు స్కోరు నమోదు చేసింది. ఆఖరి రోజు ఆదివారం ఆటలోనూ ఆధిపత్యం ప్రదర్శిస్తే..భారత్ ఖాతాలో మరో సిరీస్ చేరినట్లే.
ముంబై: వాంఖడే వేదికగా జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా మహిళల ఏకైక టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ టెస్టుకు భిన్నంగా ఆసీస్ టీమ్..భారత్‌కు దీటైన పోటీనిస్తున్నది. మూడో రోజైన శనివారం..ఆసీస్‌ను నిలువరిద్దామనుకున్న టీమ్ఇండియా ఆశలు నెరవేరలేదు. 187 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్ ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. చేతిలో ఐదు వికెట్లు ఉన్న కంగారూలు ప్రస్తుతం 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సదర్లాండ్ (12), గార్డ్నర్(7) క్రీజులో ఉన్నారు. స్నేహ్‌రానా(2/54), హర్మన్‌ప్రీత్‌కౌర్ (2/23) రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 376/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 406 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్లు దీప్తిశర్మ(78), పూజ వస్ర్తాకర్(47) అదే జోరు కొనసాగించలేకపోయారు. 30 పరుగుల వ్యవధిలో టీమ్ఇండియా మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. ఓవరాల్‌గా టెస్టుల్లో ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇదే తొలి ఇన్నింగ్స్ అత్యుత్తమ స్కోరు. ముఖ్యంగా దీప్తి, పూజ ఎనిమిదో వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టెస్టుల్లో ఎనిమిదో వికెట్‌కు భారత్‌కు ఇదే అత్యుత్తమం కాగా, ఓవరాల్‌గా రెండో బెస్ట్‌గా నిలిచింది.
కౌర్ కమాల్: భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్..భారత్‌కు దీటైన పోటీనివ్వడంలో సఫలమైంది. ఇంగ్లండ్ తరహాలో కంగారూలను కట్టిపడేద్దామనుకున్న టీమ్ఇండియా వ్యుహా లు ఫలించలేదు. ఓపెనర్లు బేత్ మూనీ (33), లిచ్ఫీల్ ్డ(18) ఆసీస్‌కు మెరుగైన శుభారంభం అందించారు. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో మూనీని రీచాఘోష్ సూపర్ త్రోతో పెవిలియన్ పంపడంతో 49 పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన ఎలీస్ పెర్రీ(45)భారత్ బౌలింగ్ దాడిని సమర్థంగా నిలువరించింది.
అయితే రానా బౌలింగ్‌లో లిచ్‌ఫీల్డ్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత మెక్‌గ్రాత్ (73)..పెర్రీకి జత కలువడం ఇన్నింగ్స్ గతిని మార్చేసింది. వీరిద్దరిని ఔట్ చేసేందుకు బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది. దీంతో తానే స్వయంగా బౌలింగ్‌కు దిగిన కెప్టెన్ కౌర్ అనుకున్న ఫలితం సాధించింది. రానా బౌలింగ్‌లో వికెట్‌కీపర్ భాటియా క్యాచ్‌తో పెర్రీ నిష్క్రమించడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత కౌర్ తొలి బంతికే మెక్‌గ్రాత్ వికెట్ల ముందు దొరికిపోయింది. అయితే డీఆర్ఎస్కు వెళ్లిన మెక్‌గ్రాత్ 52 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నాటౌట్‌గా బయటపడింది. నిరాశచెందని కౌర్..మెక్‌గ్రాత్‌ను క్లీన్‌బౌల్డ్ చేసింది. షాట్ ఆడే క్రమంలో మెక్‌గ్రాత్ నాలుగో వికెట్‌గా వెనుదిరిగింది. మరో ఎండ్‌లో ప్రమాదకరంగా మారుతున్న కెప్టెన్ అలీసా హిలీ (32)ని కౌర్ ఎల్బీడబ్ల్యూ చేయడంతో టీమ్ఇండియా సంబురాల్లో మునిగిపోయింది. ఈ క్రమంలో షార్ట్ ఫార్వర్డ్ లెగ్‌లో జెమీమా రోడ్రిగ్స్ వరుస బంతుల్లో హిలీ ఇచ్చిన క్యాచ్‌లు విడిచిపెట్టడంతో రాజేశ్వరి గైక్వాడ్‌కు నిరాశే ఎదురైంది. ఆటకు ఆఖరి రోజైన ఆదివారం ఆసీస్‌ను తొందరగా ఆలౌట్ చేసి లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమ్ఇండియా పట్టుదలతో ఉంది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 219 ఆలౌట్,
భారత్ తొలి ఇన్నింగ్స్: 406 ఆలౌట్,
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 233/5(మెక్‌గ్రాత్ 73, పెర్రీ 45, కౌర్ 2/23, రానా 2/54)