BGT | మెల్బోర్న్: జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియాగా సాగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో భారత పేసర్ మరోసారి అద్భుత స్పెల్‌తో మ్యాజిక్ చేయడంతో బాక్సింగ్ డే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కంగారూలు తోకముడిచారు. బుమ్రా (4/56) మరోసారి విజృంభించగా మహ్మద్ సిరాజ్ (3/66) కూడా అతడికి అండగా నిలవడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 228/9 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు ఆధిక్యం 333 పరుగులుగా ఉంది. టాపార్డర్, మిడిలార్డర్ పనిపట్టిన బౌలర్లు.. ఆఖరి వరుస బ్యాటర్లు నాథన్ లియాన్ (54 బంతుల్లో 41 నాటౌట్, 5 ఫోర్లు), స్కాట్ బొలాండ్ (65 బంతుల్లో 10 నాటౌట్, 1 ఫోర్) వికెట్ తీయలేక చతికిలపడ్డారు. ఈ ఇద్దరూ పదో వికెట్‌కు అజేయంగా 55 పరుగులు జోడించి ఆసీస్ ఆధిక్యాన్ని 330 పరుగుల మార్కును దాటించారు. ఆట ఆఖరిరోజైన సోమవారం ఈ ఇద్దరినీ త్వరగా ఔట్ చేసి ఛేదనను భారత్ ఏ మేరకు విజయవంతం చేయగలుగుతుందనేది ఆసక్తికరం. 2021లో ఇదే కంగారూలతో ప్రఖ్యాత గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో 329 పరుగులను ఛేదించి సిరీస్‌ను దక్కించుకున్న భారత్.. ఆ మ్యాజిక్‌ను రీక్రియేట్ చేస్తే మెల్బోర్న్ మన సొంతమవడం పక్కా! కానీ నాలుగో రోజు ఆటలో బంతి శరీరం మీదకు దూసుకురావడం, పిచ్‌పై అస్థిరమైన బౌన్స్‌తో చివరి రోజు ఆసీస్ పేస్ దళం నుంచి భారత బ్యాటర్లకు తిప్పలు తప్పకపోవచ్చు.
140.4-38-384-29.. మరో మ్యాచ్ మిగిలున్న బీజీటీలో బుమ్రా బౌలింగ్ గణాంకాలివి. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో బుమ్రా దరిదాపుల్లో కూడా (17 వికెట్లతో కమిన్స్ రెండో స్థానం) ఏ బౌలర్ లేడు. సిరీస్ ఆరంభం నుంచి కంగారూలను ముప్పు తిప్పలు పెడుతున్న ఈ పేసు గుర్రం.. రెండో ఇన్నింగ్స్‌లోనూ హడలెత్తించాడు. నాలుగో రోజు ఆటలో ఓవర్ నైట్ స్కోరు 358/9కు మరో 11 పరుగులు జోడించి (369) భారత్ ఆలౌట్ అవగా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 105 రన్స్ ఆధిక్యం దక్కింది. మూడో రోజు సెంచరీ హీరో నితీశ్ రెడ్డి (114)ని లియాన్ ఔట్ చేసి భారత ఇన్నింగ్స్‌కు తెరదించాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్ ఏడో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో మెరుపులు మెరిపించిన ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (8)ను బుమ్రా ఈసారి ఎక్కువసేపు క్రీజులో నిలువనీయలేదు. బుమ్రా వేసిన బంతిని డిఫెన్స్ ఆడబోయిన కొన్‌స్టాస్.. అది కాస్తా మిస్ అవడంతో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కొద్దిసేపు విసిగించిన ఉస్మాన్ ఖవాజా (21)ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. లంచ్ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ హీరో స్టీవ్ స్మిత్ (13) సైతం సిరాజ్ బౌలింగ్‌లోనే పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వరుస ఓవర్లో బుమ్రా ఆసీస్ మిడిలార్డర్ పనిపట్టాడు. 34వ ఓవర్ రెండో బంతికి ప్రమాదకర హెడ్ (1)ను వెనక్కిపంపిన అతడు.. ఆరో బంతికి మిచెల్ మార్ష్ (0)నూ ఔట్ చేశాడు. అదే ఊపులో తన తర్వాతి ఓవర్లో అలెక్స్ కేరీ (2)నూ బౌల్డ్ చేయడంతో ఆసీస్ 91/6తో నిలిచింది.
భారత బౌలర్ల జోరుతో ఆసీస్ 150 పరుగుల లోపే ఆలౌట్ అవుతుందని భావించినా లబూషేన్ (139 బంతుల్లో 70, 3 ఫోర్లు) మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ (41) అండగా అతడు భారత బౌలర్లను విసిగించాడు. సుమారు 20 ఓవర్ల పాటు వికెట్‌ను కాపాడుకున్న ఈ ద్వయం ఏడో వికెట్‌కు విలువైన 57 పరుగులు జోడించింది. ఈ క్రమంలో వీరిద్దరూ ఇచ్చిన క్యాచ్‌లను గల్లీలో యశస్వీ జైస్వాల్ వదిలేయడం భారత్‌ను దెబ్బకొట్టింది. అర్ధ సెంచరీ పూర్తిచేసి ప్రమాదకరంగా మారుతున్న లబూషేన్‌ను ఎట్టకేలకు సిరాజ్.. టీ విరామం తర్వాత వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. మిచెల్ స్టార్క్ (5) పంత్ త్రోకు రనౌట్ అవగా కమిన్స్‌ను జడేజా వెనక్కిపంపాడు.
ప్రధాన బ్యాటర్లందరినీ త్వరగానే వెనక్కిపంపిన భారత బౌలర్లు ఆఖర్లో పట్టు విడిచారు. లియాన్, బొలాండ్ క్రీజులోకి వచ్చేసరికి ఆసీస్ ఆధిక్యం 278 పరుగులు. కానీ ఈ ఇద్దరూ పట్టుదలతో ఆడి ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచారు. వీరిని ఔట్ చేసేందుకు రోహిత్.. బౌలర్లను మార్చినా అనవసర షాట్లకు పోకుండా ఈ ఇద్దరూ జాగ్రత్తపడ్డారు. కొత్తబంతి తీసుకున్నాక బుమ్రా బౌలింగ్‌లో లియాన్.. స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చినా అది నోబాల్‌గా తేలడంతో అతడు బతికిపోయాడు.
టెస్టులలో బుమ్రా మరో ఘనతను అందుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో హెడ్‌ను ఔట్ చేసిన తర్వాత అతడు టెస్టులలో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. తన కెరీర్లో 44వ టెస్టు ఆడుతున్న బుమ్రా.. అంతర్జాతీయ టెస్టులలో కనీసం 200 వికెట్లు తీసి సగటు 20 కంటే తక్కువ కలిగిన బౌలర్లలో మొదటివాడుగా నిలిచాడు. విండీస్ దిగ్గజాలు మాల్కమ్ మార్షల్ (20.94), జోయల్ గార్నర్ (20.97) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బంతులపరంగా చూస్తే వకార్ యూనిస్ (7,725), డేల్ స్టెయిన్ (7,848), రబాడా (8,154) తర్వాత బుమ్రా (8,484) నాలుగో స్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున టెస్టులలో 200 వికెట్ల మైలురాయిని దాటినవారిలో బుమ్రా 12 బౌలర్ కాగా అత్యంత వేగంగా ఈ ఘనత సాధించినవారిలో అశ్విన్ (37 టెస్టులలో) తర్వాత జడేజా(44)తో రెండో స్థానంలో సమానంగా నిలిచాడు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 474 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: 369 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 82 ఓవర్లలో 228/9 (లబూషేన్ 70, లియాన్ 41 నాటౌట్, బుమ్రా 4/56, సిరాజ్ 3/66)