భారీ ఆశలతో ఆస్ట్రేలియా వెళ్లిన భారత జట్టుకు పదేండ్లుగా నిలబెట్టుకుంటున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కాపాడుకోవడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు రేసులో నిలిచేందుకు ఆఖరి అవకాశం. శుక్రవారం నుంచి సిడ్నీ వేదికగా ఆతిథ్య ఆసీస్‌తో టీమ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. సిరీస్‌లో ఇప్పటికే 1-2తో వెనుకబడి ఉన్న భారత్.. చివరి టెస్టులో సారథి రోహిత్ శర్మపై వేటు వేయనున్నట్టు సమాచారం. రోహిత్‌ను తప్పించి బుమ్రా నాయకత్వంలో ఈ మ్యాచ్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక తొలి టెస్టు ఓడినప్పటికీ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకున్న ఆసీస్.. సిడ్నీలోనూ గెలిచి సిరీస్‌తో పాటు డబ్ల్యూటీసీ బెర్తును ఖాయం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది.
సిడ్నీ: సుమారు నెలన్నర రోజులుగా టెస్టు క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లోని భారత్, ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముగింపు దశకు చేరుకుంది. శుక్రవారం నుంచి ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ) వేదికగా టీమ్ఇండియా, ఆసీస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. సిరీస్‌లో ఇప్పటికే 1-2తో వెనుకబడి ఉన్న భారత్‌కు ఈ మ్యాచ్ గెలవడం అత్యంత ఆవశ్యకం. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో నిలవాలన్నా.. బీజీటీని నిలబెట్టుకోవాలన్నా టీమ్ఇండియాకు ఈ టెస్టులో గెలవడం కీలకం. ఈ మ్యాచ్‌లో ఓడితే పదేండ్లుగా కాపాడుకుంటున్న బీజీటీతో పాటు డబ్ల్యూటీసీ ఆశలు సంపూర్ణంగా వదులుకోవాల్సిందే!
కీలక మ్యాచ్ కావడంతో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో తంటాలు పడుతున్న సారథి రోహిత్ శర్మను సిడ్నీ టెస్టుకు పక్కనబెట్టి బుమ్రాకు నాయకత్వ పగ్గాలు అప్పగించనున్నట్టు సమాచారం. మెల్బోర్న్ టెస్టు తర్వాత రోహిత్ రిటైర్మెంట్ గురించి చర్చ జరుగగా సిడ్నీలో ఆడి ఆ తర్వాత టెస్టులకు వీడ్కోలు పలకొచ్చుననే చర్చలు వినిపించాయి. కానీ గంభీర్ మాత్రం అందుకు సిద్ధంగా లేడని తెలుస్తోంది. అదే జరిగితే పెర్త్ టెస్టు మాదిరే బుమ్రా జట్టును నడిపిస్తాడు. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరకుంటే మెల్బోర్న్ టెస్టే రోహిత్ కెరీర్లో చిట్టచివరిది అవుతుంది!
సిరీస్‌లో భారత్‌ను ప్రధానంగా ఇబ్బందిపెడుతున్నది బ్యాటింగ్ సమస్యే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. రోహిత్‌ను పక్కనబెడితే యశస్వీ జైస్వాల్‌తో పాటు కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా వస్తాడు. గత టెస్టులో ఆడని శుభ్‌మన్ గిల్‌ను తుది జట్టులో ఆడిస్తే అతడు మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఇక ఈ సిరీస్‌లో బాధ్యతారాహిత్యంగా ఆడుతున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పైనా వేటు తప్పకపోవచ్చునని జట్టు వర్గాల వినికిడి. అతడి స్థానంలో ద్రువ్ జురెల్‌ను ఫైనల్ లెవెన్‌లో చేర్చే అవకాశాలున్నాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సిడ్నీలో అయినా రాణించాలని భారత్ గంపెడాశలు పెట్టుకుంది. జోరుమీదున్న ఆసీస్ బౌలర్లను భారత జట్టు ఎలా ఎదుర్కుంటుందో చూడాలి. సిడ్నీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో తుది జట్టులో రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్‌కూ బెర్త్ దక్కొచ్చు. ఇక పేస్ దళాన్ని బుమ్రా నడిపించనున్నాడు. గాయంతో పేసర్ ఆకాశ్ దీప్ ఈ టెస్టుకు దూరమవడంతో అతడి స్థానాన్ని హర్షిత్ రాణా లేదా ప్రసిధ్ కృష్ణ భర్తీ చేసే అవకాశం ఉంది.
మరోవైపు ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూకుడుమీదుంది. తొలి టెస్టులో ఓడినప్పటికీ అద్భుతంగా పుంజుకున్న కంగారూలు.. సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచి జోరుమీదున్నారు. బుమ్రా, జైస్వాల్, నితీశ్ వంటి కొద్దిమంది తప్పితే ఆస్ట్రేలియా జోరును భారత్ నిలువరించలేకపోతోంది. స్టీవ్ స్మిత్, లబూషేన్ మంచి ఫామ్‌లో ఉండగా తొలి టెస్టు హీరో సామ్ కొన్‌స్టాస్ మరోసారి మెరుపులు మెరిపించాలని ఆ జట్టు కోరుకుంటోంది. మిడిలార్డర్లో మిచెల్ మార్ష్ స్థానంలో ఆ జట్టు ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్‌ను తుదిజట్టులోకి తీసుకుంది.