సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య ఈ ఏడాది నవంబర్‌లో మొదలుకావాల్సి ఉన్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)కి ముందే కంగారులు మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. గత పదేండ్లలో బీజీటీ నెగ్గని ఆసీస్ ఈసారి మాత్రం దానిని వదిలే సమస్యే లేదని అంటోంది. తాజాగా ఆ జట్టు స్టార్ స్పిన్నర్ నాథన్ లియన్ ఈఎస్పీన్‌తో మాట్లాడుతూ.. ‘పదేండ్ల నుంచి బీజీటీలో మాకు నిరాశే ఎదురవుతోంది. కానీ ఈసారి మాత్రం అలా కానివ్వం. భారత్ అత్యంత కఠిన ప్రత్యర్థి. మేం ఆ ట్రోఫీని తిరిగి చేజిక్కించుకోవాలని ఆకలితో ఉన్నాం.
గత రెండేండ్లలో మా జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా మారింది’ అని అన్నాడు. ఆసీస్ పేసర్ జోష్ హెజిల్వుడ్ స్పందిస్తూ.. ‘ఇది మాకు కచ్చితంగా ప్రతిష్టాత్మకం. స్వదేశంలో మేం తప్పకుండా నెగ్గాల్సిన సిరీస్ ఇది. కానీ భారత్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీళ్లేదు. గత రెండు సిరీస్‌లలో అలాగే చేసి దెబ్బతిన్నాం. చివరిసారి స్టార్ ప్లేయర్లకు గాయమై బీ టీమ్‌తో ఆడినా వాళ్లు మాకు షాకిచ్చారు’ అని అన్నాడు.