Under-19 Triangular Series | బీసీసీఐ త్వరలో ప్రారంభం కానున్న ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అండర్-19 ముక్కోణపు సిరీస్ కోసం ఇండియా-ఏ, ఇండియా-బీ జట్లను ప్రకటించింది. ఈ టోర్నీ నవంబర్ 17 నుంచి 30 వరకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరుగనున్నది. ఈ ముక్కోణపు సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ అండర్-19 జట్టు కూడా పాల్గొంటుంది. వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ సెలక్షన్‌కు ముందు యువ క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ టోర్నీ వేదిక కానున్నది.
పంజాబ్ బ్యాటర్ విహాన్ మల్హోత్రాను ఏ జట్టుకు కెప్టెన్‌గా నియమించగా.. ముంబయికి చెందిన అభిజ్ఞాన్ కుండును వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. బీ జట్టుకు హైదరాబాద్‌కు చెందిన ఆరోన్ జార్జ్ కెప్టెన్‌గా, గుజరాత్‌కు చెందిన వేదాంత్ త్రివేది వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వే ద్రవిడ్‌కు సైతం బీ జట్టులోనే చోటు దక్కింది. ఏ జట్టులో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ మాలిక్‌కు చోటు దక్కింది. నాంపల్లి మల్లెపల్లికి చెందిన ఈ యువ ఆటగాడు వినూ మన్కడ్ ట్రోఫీలో తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.
ఈ అద్భుత ప్రదర్శనతో మాలిక్‌కు అండర్-19 ఏ జట్టులో చోటు దక్కింది. ఈ సందర్భంగా మహ్మద్ మాలిక్ మాట్లాడుతూ అండర్-19 జట్టుకు ఎంపికవడం గౌరవంగా ఉందని.. భవిష్యత్తులో భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని మాలిక్ తెలిపాడు. మాలిక్ ఎంపికపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతను భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మహ్మద్ మాలిక్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
U19 A జట్టు : విహాన్ మల్హోత్రా (కెప్టెన్), అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్), వాఫీ కచ్చి, వంశ్ ఆచార్య, వినీత్ వీకే, లక్ష్య రాయ్‌చందానీ, ఏ రాపోల్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ ఎ సింఘేత్, అస్హమ్జీత్ పటేల్, కనిష్క్ చౌహాన్, అన్మోల్జీత్ పటేల్, అన్మోల్జీత్ పటేల్ మహీదా, ఆదిత్య రావత్, మహమ్మద్ మాలిక్.
U19 B జట్టు : ఆరోన్ జార్జ్ (కెప్టెన్), వేదాంత్ త్రివేది (వైస్ కెప్టెన్), యువరాజ్ గోహిల్, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, హర్వాన్ష్ సింగ్, అన్వే ద్రవిడ్, ఆర్ఎస్ అంబరీష్, బీకే కిషోర్, నమన్ పుష్పక్, హేమ్చుదేశన్ జె, ఉదవ్ మోహన్, ఇషాన్ సూద్, డీ దీపేష్, రోహిత్ కుమార్ దాస్.