రాజ్‌గిర్ (బీహార్) : మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో ఆడిన మ్యాచ్‌లన్నీ గెలిచి అజేయంగా నిలిచిన భారత్.. సెమీస్‌లో 2-0తో జపాన్ను చిత్తుచేసి వరుసగా రెండోసారి కప్‌ను సొంతం చేసుకునే దిశగా ముందడుగు వేసింది. భారత్ తరఫున వైస్ కెప్టెన్ నవ్‌నీత్ కౌర్ 48వ నిమిషంలో తొలి గోల్ కొట్టగా లాల్రెమ్సియామి 56వ నిమిషంలో రెండో గోల్ చేసింది. ఫైనల్లో మన అమ్మాయిలు..ఒలింపిక్స్ రజత పతక విజేత చైనాతో అమీతుమీ తేల్చుకోనున్నారు. మొదటి సెమీస్‌లో చైనా.. 3-1తో మలేషియాను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది. బుధవారం ఫైనల్ పోరు జరుగనుంది.
ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ సెమీస్‌లో ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించినా మరింత భారీ తేడాతో గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఏకంగా 13 పెనాల్టీ కార్నర్ (పీసీ)లను భారత్ గోల్స్‌గా మలచలేకపోయింది. జపాన్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా మన స్ట్రైకర్లు దూకుడుగా ఆడినా పెనాల్టీలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. తొలి క్వార్టర్ ఐదో నిమిషంలోనే గోల్ చేసే అవకాశమొచ్చినా తొలి పెనాల్టీని సారథి సలీమా గోల్ చేయడంలో విఫలమైంది. మొదటి క్వార్టర్‌లోనే మరో రెండు పీసీలను భారత్ వృథా చేసుకుంది. 21, 24, 35, 47వ నిమిషాల్లోనూ పీసీ అవకాశాలు వచ్చినా వాటిని గోల్‌పోస్ట్‌లోకి పంపించలేకపోయింది. జపాన్ గోల్‌కీపర్ కుడొ వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది. ఈ టోర్నీ మూడో స్థానం కోసం జపాన్..మలేషియాతో ఆడనుంది. కొరియా ఐదో స్థానంతో సరిపెట్టుకోగా థాయ్‌లాండ్ ఆరో స్థానంతో ముగించింది.