లండన్: మహిళల ప్రపంచకప్‌లో భారత అమ్మాయిలు అత్యంత కఠిన సవాల్‌కు సిద్ధమయారు. ఆదివారం భారత జట్టు ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా ఆరుసార్లు చాంపియన్స్ ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. సెమీస్ చేరాలంటే ఉమెన్ ఇన్ బ్లూ ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే. గ్రూప్-ఏలో భారత్‌తో పాటు సౌతాఫ్రికా సైతం సెమీస్ రేసులో ఉన్న నేపథ్యంలో టీమిండియాకు విజయం తప్ప మిగతా ప్రత్యామ్నాయాలేమీ లేవు. అయితే సెమీస్ రేసులోనే ఉన్న దక్షిణాఫ్రికా భవితవ్యం కూడా భారత్ చేతిలోనే ఉంది. ఇరుజట్లు 4 మ్యాచ్‌లాడి మూడింట గెలిచినప్పటికీ నెట్న్‌ర్రేట్ విషయంలో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన (+2.268).. సఫారీ (+0.734)ల కంటే మెరుగ్గా ఉండటం వారికి కలిసొచ్చేదే. భారత్, ఆసీస్ మ్యాచ్ కంటే ముందే సౌతాఫ్రికా.. బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో గనుక బంగ్లా.. సఫారీలకు షాకిస్తే అప్పుడు సెమీస్ రేసు త్రిముఖ పోటీ అవుతుంది. అప్పుడు నెట్న్ రేట్ కీలకంగా మారుతుంది. దక్షిణాఫ్రికా గెలిచి ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడితే మాత్రం వన్డే ప్రపంచ చాంపియన్లకు భంగపాటు తప్పదు. మిడిలార్డర్, ఫీల్డింగ్ వైఫల్యాలతో సతమతమవుతున్న టీమిండియా.. టోర్నీలో ఓటమెరుగని ఆస్ట్రేలియాతో పోరులో ఏం చేసేనో మరి!