భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ సందర్భం! ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న వన్డే ప్రపంచకప్ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ దరిచేరింది. సొంత ఇలాఖాలో తమ కలల కప్‌ను తొలిసారి సాకారం చేసుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి టీమ్ఇండియా జగజ్జేతగా నిలిచింది. షెఫాలీవర్మ, దీప్తిశర్మ అర్ధసెంచరీలతో భారీ స్కోరు అందుకున్న భారత్..స్ఫూర్తిదాయక పోరాటంతో కదంతొక్కింది. లక్ష్యఛేదనలో సఫారీ కెప్టెన్ లారా వోల్వార్డ్ సెంచరీ పోరాటం సఫలం కాలేకపోయింది. దీప్తిశర్మ ఐదు వికెట్ల విజృంభణతో సఫారీలు రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కోట్లాది భారతీయుల ఆకాంక్షలను నిజం చేస్తూ భారత మహిళామణులు మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించారు.
ముంబై: దశాబ్దాలుగా ఊరిస్తున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను (Women’s World Cup) స్వదేశంలో భారత జట్టు (Team India) సగర్వంగా ముద్దాడింది. ఆదివారం సుమారు 40వేల మంది అభిమానుల సమక్షంలో నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఉమెన్ ఇన్ బ్లూ.. దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో మట్టికరిపించి కొత్త చరిత్ర సృష్టించింది. భారత్ నిర్దేశించిన భారీ ఛేదనలో సౌతాఫ్రికా.. 45.3 ఓవర్లలో 246 పరుగుల వద్దే ఆగిపోయి తొలి కప్పు కలకు దూరమైంది. ఛేదనలో సారథి లారా వోల్వార్డ్ (98 బంతుల్లో 101, 11 ఫోర్లు, 1 సిక్స్) బ్యాక్ టు బ్యాక్ శతకంతో కదం తొక్కినా మిగిలిన బ్యాటర్లు విఫలమవడం ఆ జట్టును దెబ్బతీసింది. బ్యాట్‌తో మెరిసిన దీప్తి.. బంతితోనూ (5/39) కీలక వికెట్లు తీసి సఫారీల నడ్డి విరిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు సాధించింది. షెఫాలీ వర్మ (78 బంతుల్లో 87, 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సాధికారిక ఇన్నింగ్స్‌కు తోడు దీప్తి (58 బంతుల్లో 58, 3 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మంధాన (58 బంతుల్లో 45, 8 ఫోర్లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షెఫాలీకి దక్కగా టోర్నీలో 215 రన్స్, 22 వికెట్లతో సత్తాచాటిన దీప్తి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా ఎంపికైంది.
నాకౌట్ దశలో జట్టులోకి వచ్చిన షెఫాలీ.. కీలక మ్యాచ్‌లో సత్తాచాటింది. దూకుడు, సంయమనం కలగలిపి ఆడిన ఆమె.. జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వందశాతం నిలబెట్టుకుంది. తొలి వికెట్‌కు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (58 బంతుల్లో 45, 8 ఫోర్లు)తో కలిసి 104 పరుగులు జోడించి బలమైన పునాది వేసింది. ఖాకా రెండో ఓవర్లోనే ముందుకొచ్చి ఆడిన ఆమె.. కాప్ బౌలింగ్‌లోనూ అదే దూకుడును ప్రదర్శించింది. మరో ఎండ్‌లో స్మృతి ఆఫ్‌సైడ్ దిశగా తనదైన ట్రేడ్‌మార్క్ డ్రైవ్‌లు, లేట్‌కట్, స్వీప్ షాట్లతో అలరించింది. కానీ పవర్ ప్లే తర్వాత స్కోరువేగం క్రమంగా మందగించింది.
అర్ధశతకానికి చేరువవుతున్న క్రమంలోట్రయాన్ వేసిన 18వ ఓవర్లో నాలుగో బంతి స్మృతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకి కీపర్ జాఫ్టా చేతుల్లో పడటంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్లో ఆఖరి బంతికి సింగిల్‌తో షెఫాలీ ఫిఫ్టీ పూర్తయింది. స్మృతి స్థానంలో వచ్చిన జెమీమా (24)తో కలిసి షెఫాలీ స్కోరువేగాన్ని పెంచింది. ఇద్దరూ వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తుతూ రన్‌రేట్ పడిపోకుండా జాగ్రత్తపడ్డారు. శతకం దిశగా సాగుతున్న షెఫాలీ.. ఖాకా 28వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి మిడాఫ్‌లో లుస్ చేతికి చిక్కడం జట్టును దెబ్బతీసింది.
షెఫాలీ నిష్క్రమణ తర్వాత భారత బ్యాటింగ్ లైనప్ తడబడింది. ఖాకా.. 30వ ఓవర్లో జెమీమాను ఔట్ చేయగా భారత్ భారీ ఆశలు పెట్టుకున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (20)ను ఎంలబా బౌల్డ్ చేసింది. దీప్తి వేగంగా ఆడలేకపోయినా వికెట్ల పతనాన్ని అడ్డుకుని సంయమనాన్ని ప్రదర్శించింది. అమన్‌జ్యోత్ (12) వేగంగా ఆడలేక డి క్లెర్క్ బౌలింగ్‌లో ఆమెకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. అయితే ఏడో స్థానంలో వచ్చిన రిచా (24 బంతుల్లో 34, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో భారత్ ప్రత్యర్థి ఎదుట పోరాడగలిగే స్కోరును నిర్దేశించగలిగింది.
రికార్డు ఛేదనను సఫారీలూ నిలకడగానే ఆరంభించారు. తొలి వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం తర్వాత తజ్మిన్ బ్రిట్స్ (23).. అమన్‌జ్యోత్ సూపర్ త్రో తో భారత్‌కు తొలి వికెట్ దక్కింది. శ్రీచరణి.. బోష్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. కానీ మరో ఎండ్‌లో వోల్వార్డ్ మరోసారి బాధ్యతాయుతంగా ఆడింది. వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించింది. సునె లుస్ (25)తో కలిసి మూడో వికెట్‌కు 52 రన్స్ జోడించి ఆ జట్టును లక్ష్యం దిశగా నడిపించింది. రాధా యాదవ్ 17వ ఓవర్లో బౌండరీతో ఆమె అర్ధ శతకం పూర్తయింది. అయితే 21వ ఓవర్లో హర్మన్.. షెఫాలీకి బంతినివ్వడంతో ఆమె వరుస ఓవర్లలో లుస్, మరిజనె కాప్‌ను పెవిలియన్‌కు పంపింది. జాఫ్టా (16)ను దీప్తి ఔట్ చేసి ఒత్తిడి పెంచాలని చూసింది. కానీ అనెరి డెర్క్సెన్ (35) వేగంగా ఆడింది. రాధా 32వ ఓవర్లో ఆమె రెండు భారీ సిక్సర్లు బాదింది. డెర్క్సెన్, లారా ద్వయం స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆరో వికెట్‌కు 61 రన్స్ జోడించారు.
భారత్: 50 ఓవర్లలో 298/7 (షెఫాలీ 87, దీప్తి 58, ఖాకా 3/58, ట్రయాన్ 1/46); దక్షిణాఫ్రికా: 45.3 ఓవర్లలో 246 ఆలౌట్ (వోల్వార్డ్ 101, డెర్క్సెన్ 35, దీప్తి 5/39, షెఫాలీ 2/36)
వన్డేలు ఆడి ఏడాది దాటింది. ఫామ్ లేమి కారణంగా జట్టులో చోటు కోల్పోయింది. ఎన్నిసార్లు అవకాశమిచ్చినా ఆటతీరులో మార్పులేకపోవడంతో వేటు తప్పలేదు. దీంతో జట్టు ప్రతీక రావల్ రూపంలో కొత్త ఓపెనర్‌ను వెతుక్కోవడం.. ఆమె నిలకడగా రాణించడంతో వన్డే జట్టులో షెఫాలీ పునరాగమనంపై నీలినీడలే కమ్ముకున్నాయి. ప్రపంచకప్‌నకు ప్రకటించిన జట్టులోనూ ఆమె పేరు బ్యాకప్‌గా కూడా లేదు. ఐర్లాండ్ సిరీస్‌కు ముందు జట్టులో చోటు కోల్పోయాక తండ్రికి గుండెపోటు.. కానీ ఆమె కుంగిపోలేదు. దేశవాళీకి వెళ్లి తనను తాను నిరూపించుకుంది. సీనియర్ ఉమెన్స్ వన్డే ట్రోఫీ (2024-25)లో ఏడు ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 75.29 సగటుతో 527 రన్స్ చేసింది.
సీనియర్ ఉమెన్స్ వన్డే చాలెంజర్స్ ట్రోఫీలోనూ 414 రన్స్ సాధించి మళ్లీ సెలక్టర్ల దృష్టిలో పడింది. గత సీజన్ డబ్ల్యూపీఎల్‌లోనూ 304 రన్స్‌తో సత్తాచాటింది. వరల్డ్ కప్‌లో భారత్ ఆడిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ప్రతీక కాలికి గాయమవడం షెఫాలీకి కలిసొచ్చింది. ఆస్ట్రేలియాతో సెమీస్‌లో ఆమె ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా కీలకమైన ఫైనల్లో మాత్రం ఆల్‌రౌండ్ షో తో తన విలువను చాటుకుంది. బ్యాట్‌తో విలువైన పరుగులు చేయడమే గాక బంతితో రెండు కీలక వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలకపాత్ర పోషించింది. సెమీస్ మ్యాచ్‌కు ముందు ఆమె.. ‘ఒక క్రీడాకారిణిగా ప్రతీకకు జరిగింది మంచిది కాదు. కానీ జట్టుకు ఏదైనా మంచి చేయడానికే ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడేమో!’ అని చెప్పినట్టుగానే ఫైనల్లో జట్టుకు కప్పును అందించేందుకు షెఫాలీని ఆ దేవుడే పంపించాడేమో..!
సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో సువర్ణధ్యాయం! మన అమ్మాయిలు క్రికెట్ ప్రపంచాన్ని జయించారు. అవనిలో సగమైన అమ్మాయిలు తమ సత్తాఏంటో చేతల్లో చూపెట్టారు. అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తూ ప్రపంచ విజేతలుగా నిలిచారు. సొంతగడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌కప్‌లో గెలుపు బావుటా ఎగురవేశారు. ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న కలల కప్‌ను అప్యాయంగా ముద్దాడారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్న రీతిలో ప్రాణం పెట్టి పోరాడుతూ ఫైనల్లో దక్షిణాఫ్రికాను మట్టికరిపించారు. ఏడాది కిందట ఇదే సఫారీలను అబ్బాయిలు ఓడించి పొట్టి ప్రపంచకప్ టైటిల్ గెలిస్తే..వారిని స్ఫూర్తిగా తీసుకున్న మహిళామణులు ముంబైలో మరో చరిత్ర లిఖించారు. చిక్కినట్లే చిక్కి రెండుసార్లు చేజారిన వన్డే ప్రపంచకప్ ట్రోఫీ ముచ్చటగా మూడో ప్రయత్నంలో ఒడిసిపట్టుకున్నారు. వేలాది మంది అభిమానుల మద్దతు మధ్య అద్భుత ప్రదర్శన కనబరుస్తూ అంతర్జాతీయ వేదికపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించారు.
దిగ్గజాల దరిచేరని అనితర సాధ్యమైన రికార్డు హర్మన్‌ప్రీత్‌కౌర్ సారథ్యంలోని భారత్ అక్కున చేర్చుకుంది. కీలకమైన సెమీస్‌లో ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించిన టీమ్ఇండియా అదే జోష్‌లో టైటిల్ పోరులో దక్షిణాఫ్రికా భరతం పట్టింది. శ్రీలంకతో మొదలైన భారత వరల్డ్‌కప్ ప్రస్థానం ఒడిదుడుకుల పయనంగా నిలిచింది. లంకపై ఘన విజయంతో మెగాటోర్నీని మొదలుపెట్టిన టీమ్ఇండియా అదే ఊపులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌కు చుక్కలు చూపెట్టింది. మెగాటోర్నీలో అదే దూకుడు కొనసాగిస్తుందనుకున్న కౌర్‌సేన వరుసగా మూడు(దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) మ్యాచ్‌ల్లో అనూహ్య ఓటములు ఎదురయ్యాయి.
సెమీఫైనల్ చేరాలంటే తప్పక గెలువాల్సిన పరిస్థితుల్లో న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌పై టీమ్ఇండియా స్ఫూర్తిదాయక విజయాలు సొంతం చేసుకుంది. భారీ సోర్కింగ్(340) మ్యాచ్‌లో కివీస్ రెక్కలు విరిచింది. ఓపెనర్లు స్మృతి మందన, ప్రతీకా రావల్ సూపర్ సెంచరీలతో చెలరేగిన ఈ పోరులో పరుగుల వరద పారింది. అటుపై బంగ్లాతో ఆఖరి పోరు వర్షార్పణం కాగా, నాలుగో బెర్తుతో టీమ్ఇండియా నాకౌట్లోకి అడుగుపెట్టింది. కీలకమైన సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను కంగారెత్తిస్తూ మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. లక్ష్యఛేదనలో సరికొత్త రికార్డు నెలకొల్పుతూ ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. ఫైనల్లోనూ అదే స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబరుస్తూ దక్షిణాఫ్రికాపై జయభేరితో మొదటిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ ప్రయాణంలో ప్రతీ ఒక్కరి పాత్ర కీలకమని చెప్పాలి.
ఓవైపు ఓపెనర్లు మందన, ప్రతీక జట్టుకు మెరుగైన శుభారంభాలు అందిస్తే..మిడిలార్డర్లో జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్‌కౌర్, దీప్తిశర్మ, రీచా ఘోష్ భారీ స్కోర్లకు బాటలు వేశారు. కీలకమైన సెమీస్‌కు ముందు గాయంతో ప్రతీక మెగాటోర్నీకి దూరం కాగా, ఆమె స్థానంలో వచ్చిన చిచ్చరపిడుగు షెఫాలీవర్మ తన విలువేంటో చూపెట్టింది. సెమీస్‌లో విఫలమైనా…సఫారీలతో ఫైనల్లో అర్ధసెంచరీతో జట్టు భారీ స్కోరుకు కారణమైంది. క్రాంతిగౌడ్, రేణుకా ఠాకూర్, అమన్జ్యోత్కౌర్ పేస్‌కు తోడు శ్రీచరణి, దీప్తిశర్మ, స్నేహ్‌రానా స్పిన్‌తో వికెట్ల వేట కొనసాగించారు. మొత్తంగా క్రికెట్‌ను మతంగా భావించే దేశంలో అమ్మాయిల విజయం సరికొత్త అధ్యాయానికి నాంది పలకడం ఖాయంగా కనిపిస్తున్నది.

ప్రమాదకరంగా పరిణమిస్తున్న లారా, డెర్క్సెన్ ద్వయాన్ని దీప్తి శర్మ విడదీసి భారత్‌ను తిరిగి పోటీలోకి తెచ్చింది. 40వ ఓవర్లో ఆమె.. డెర్క్సెన్ను క్లీన్‌బౌల్డ్ చేసి మ్యాచ్‌ను మన వైపు తిప్పింది. అదే ఓవర్లో ఐదో బంతికి సింగిల్ తీసిన లారా.. వరుసగా రెండో శతకాన్ని నమోదుచేసింది. 42వ ఓవర్లో దీప్తి.. సఫారీలకు డబుల్ షాకులిచ్చింది. తొలి బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా ఆడిన లారా.. అమన్‌జ్యోత్ క్యాచ్ అందుకోవడంతో నిష్క్రమించింది. నాలుగో బంతికి ట్రయాన్ (9)ను వికెట్ల ముందు బలిగొంది. తన 46వ ఓవర్లో డి క్లెర్క్ (18) ఇచ్చిన క్యాచ్‌ను హర్మన్‌ప్రీత్ అందుకుని 140 కోట్లాది అభిమానుల కలను నెరవేర్చింది.