ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న చందంగా.. తొలి పోరులో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన భారత మహిళల జట్టు.. మలి పోరులో దాయాది పాకిస్థాన్‌ను చిత్తు కింద కొట్టింది. మొదట బౌలర్లు విజృంభించడంతో చిరకాల ప్రత్యర్థిని వందలోపు ఆలౌట్ చేసిన మన అమ్మాయిలు.. ఆనక బ్యాటింగ్‌లో తమ ప్రతాపం కనబర్చారు. స్టార్ ఓపెనర్ స్మృతి మందన బౌండ్రీలతో మోతెక్కించడంతో టీమ్ఇండియా మరో 38 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది.
బర్మింగ్‌హామ్: తొలి పోరులో తడబడ్డ భారత మహిళల క్రికెట్ జట్టు రెండో మ్యాచ్‌లో విశ్వరూపం కనబర్చింది. కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి ప్రవేశ పెట్టిన మహిళల టీ20 క్రికెట్లో టీమ్ఇండియా బోణీ కొట్టింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. నిర్ణీత ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. మునీబా (32) టాప్ స్కోరర్ కాగా.. భారత బౌలర్లలో స్నేహ్ రాణా, రాధ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో స్టార్ ఓపెనర్ స్మృతి మందన (42 బంతుల్లో 63 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టడంతో భారత్ 11.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (16), సబ్బినేని మేఘన (14) ఫర్వాలేదనిపించారు. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయానికి సమీపంగా వచ్చి.. ఆఖర్లో ఒత్తిడికి గురై ఓటమి వైపు నిలిచిన టీమ్ఇండియా.. ఈ గెలుపుతో సెమీస్ అవకాశాలను మెరుగు పర్చుకుంది. తదుపరి మ్యాచ్‌లో బుధవారం బార్బడోస్‌తో భారత్ తలపడనుంది.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్థాన్: 18 ఓవర్లలో 99 ఆలౌట్ (మునీబా 32; స్నేహ్ రాణా 2/15, రాధ 2/18), భారత్: 11.4 ఓవర్లలో 102/2 (స్మృతి మందన 63 నాటౌట్, షఫాలీ 16; ఒమైమా 1/20).