చాంగ్జౌ: బీడబ్ల్యూఎఫ్ చైనా ఓపెన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో సింధు.. 21-15, 8-21, 21-17తో టోమోకా మియాజాకి(జపాన్)పై ఉత్కంఠ విజయం సాధించింది. గంటపాటు జరిగిన పోరులో తన(15) కంటే మెరుగైన ర్యాంక్(6)లో ఉన్న మియాజాకిని సింధు చిత్తు చేసింది.
ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో తొలి గేమ్ గెలిచిన సింధుకు రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో తన అనుభవాన్ని ఉపయోగిస్తూ సింధు గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో భారత ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్‌శెట్టి 21-13, 21-9తో జపాన్ జోడీ కెన్యా మితుహషి, హిరోకి ఒకామురపై అలవోకగా గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా 21-11, 21-16తో గిల్మోర్‌పై గెలిచి ముందంజ వేసింది.