Renuka Thakur : మహిళల వన్డే ప్రపంచకప్ విజయాన్ని ఆస్వాదిస్తున్న లో భారత పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్(Renuka Thakur ) తాజాగా జీవితకాల క్షణాలను చవిచూసింది. ‘గోట్ ఇండియా టూర్ 2025′(GOAT India Tour)లో భారత పర్యటనకు వచ్చిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ(Lionel Messi)తో ఫొటోలు దిగి మురిసిపోయింది. సాకర్ మాంత్రికుడితో మాట్లాడడం.. జెర్సీని స్వీకరించడం వంటివి మర్చిపోలని క్షణాలని అంటోంది రేణుకా. మెస్సీ ఢిల్లీ టూర్ సందర్భంగా దిగిన ఫొటోలను శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది భారత పేస్ గన్.
గోట్ ఇండియా టూర్ 2025లో భారత్‌కు వచ్చిన మెస్సీ బృందం ఢిల్లీలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి పురాణా ఖిలాలో అడిడాస్ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్లో భారత అథ్లెట్లు, క్రీడాకారులు మెస్సీ బృందాన్ని కలిశారు. సాకర్ లెజెండ్‌ను కలిసిన క్షణాలను గుర్తు చేసుకున్న రేణుకా ఠాకూర్ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. ‘ప్రపంచకప్‌ను అందుకోవడం ఎంతటి గొప్ప ఫీలింగ్ ఇస్తోందో ఈ రెండు జతల చేతులకు తెలుసు. ఈ కలను సాకారం చేసినందుకు అడిడాస్ ఇండియాకు కృతజ్ఞతలు’ అని రేణుకా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది.
వరల్డ్ కప్ విజేతగా మెస్సీని కలిసిన రేణుకకు.. అతడు తన పదో నంబర్ జెర్సీని కానుకగా ఇచ్చాడు. ఆ తర్వాత రేణుక తన వెంట తీసుకొచ్చిన బంతిపై అర్జెంటీనా స్టార్ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దాంతో.. ఫుట్‌బాల్ దిగ్గజాన్ని కలవడం ద్వారా జీవితకాల కల సాకారం కావడంతో చాలా థ్రిల్‌కు.. సంతోషాకిని లోనయ్యానని చెప్పింది మ్యాచ్ విన్నర్. స్వదేశంలో ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో రేణుక ఆరు మ్యాచుల్లో 3 వికెట్లతో రాణించింది. 2-25తో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. పొట్టి ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ.. డిసెంబర్ 21 నుంచి శ్రీలంకతో జరుగబోయే టీ20 సిరీస్ కోసం రేణుక సిద్దమవుతోంది.