Kapil dev | పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా సిద్ధంగా ఉందని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. చాన్నాళ్లుగా జట్టు నిలకడగా రాణిస్తున్నదని.. ప్లేయర్లంతా మంచి లయలో ఉన్నారని ఆయన పేర్కొన్నాడు. ‘భారత జట్టు టాప్-4 నిలుస్తుందనుకుంటున్నా. మ్యాచ్ రోజు ప్రదర్శన బట్టే ఫలితాలు ఉంటాయి. కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి. మన జట్టు ఫేవరెట్ అని ఇప్పుడే అనడం తొందరపాటు అవుతుంది. అయితే మన టీమ్ బలంగా ఉందనేది మాత్రం వాస్తవం. వరల్డ్ కప్ నెగ్గేందుకు టీమ్ఇండియా సిద్ధంగా ఉంది. ఆట పట్ల వారి అంకితభావం, కఠోర శ్రమ దీన్ని తెలియచేస్తున్నది’ అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో భారత్ బౌలింగ్ దళం అత్యంత పటిష్టంగా ఉందని ఈ మాజీ ఆల్రౌండర్ అన్నాడు. ‘ఆసియాకప్ ఫైనల్లో మహమ్మద్ సిరాజ్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఒక మ్యాచ్లో మొత్తం 10 వికెట్లు పేస్ బౌలర్లే పడగొట్టడం చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు వికెట్లు పడగొట్టేందుకు మన జట్టు స్పిన్నర్లను ఆశ్రయించేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయిందంటే మన టీమ్ మెరుగైనట్లే’ అని కపిల్ వెల్లడించాడు. వరల్డ్కప్ వంటి మెగాటోర్నీకి ముందు ఆటగాళ్ల సన్నద్ధత పాటు ఫిట్నెస్ కూడా చాలా ముఖ్యమని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ గాయాల పాలవడాన్ని ప్రస్తావించిన హర్యానా హరికేన్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో ఫిట్నెస్ది ప్రధాన పాత్ర అని అన్నాడు.