పుష్కర కాలం తర్వాత స్వదేశంలో జరుగనున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం సెలెక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. ఎలాంటి సంచలనాలకు చోటివ్వకుండా ఇటీవలి కాలంలో మెరుగైన ప్రదర్శన చేసినవాళ్లను ఎంపిక చేసింది. గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ జట్టులో చోటు దక్కించుకోగా.. తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మకు నిరాశ ఎదురైంది. బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ అందుబాటులో ఉండటంతో శాంసన్‌కు మొండిచేయి తప్పలేదు. చాహల్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ఒకే స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ వైపే మొగ్గుచూపారు!
ఏడుగురు బ్యాటర్లు, నలుగురు ఆల్‌రౌండర్లు, నలుగురు బౌలర్లతో సమతూకమైన జట్టును ఎంపిక చేశామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించగా.. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫామ్ కీలకమని కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. వచ్చే నెల 5 నుంచి స్వదేశంలో మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. నెల రోజుల ముందే మన సైన్యాన్ని ప్రకటించారు. మరి వరల్డ్‌కప్‌లో ఈ బలగం ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి!
టీమ్‌లో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. ఫామ్, ఫిట్నెస్, పరిస్థితులు ఇలా అన్నీ విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే జట్టును ఎంపిక చేశారు. కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. మెగాటోర్నీలో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫామ్ కీలకం కానుంది. అతడు అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో జట్టుకు వెన్నెముకలా నిలవగలడు. ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా ఎంతో పరిణతి చూపాడు.
– రోహిత్ శర్మ, భారత కెప్టెన్
పల్లెకెలె: దశాబ్ద కాలంగా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా నెగ్గని భారత జట్టు.. స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం బలమైన జట్టును ప్రకటించింది. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల కలయికతో 15 మందితో కూడిన టీమ్‌ను చీఫ్ సెలెక్టర్ అగార్కర్ మంగళవారం ప్రకటించాడు. గాయం నుంచి కోలుకున్న వికెట్ కీపర్, బ్యాటర్ రాహుల్ జట్టులో చోటు దక్కించుకోగా.. ప్రస్తుతం ఆసియాకప్‌లో టీమ్‌తో పాటు ఉన్న వారిలో హైదరాబాదీ ఠాకూర్ తిలక్ వర్మ, పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేయలేదు. ఆసియాకప్‌లో రిజర్వ్‌గా ఉన్న శాంసన్‌కు కూడా మొండిచేయి ఎదురైంది. భారత పిచ్‌లపై అత్యంత ప్రమాదకారి కాగల మణికట్టు స్పిన్నర్ చాహల్‌ను అసలు పరిగణనలోకే తీసుకోలేదు. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌నకు ప్రాథమిక జట్లను ప్రకటించేందుకు మంగళవారం (సెప్టెంబర్ 5) చివరి తేదీ కాగా.. బీసీసీఐ టీమ్ ఎంపిక చేసింది. ఆసియాకప్‌నకు ఎంపికైనప్పటికీ గాయం పూర్తిగా తగ్గకపోవడంతో టీమ్‌కు దూరంగా ఉన్న రాహుల్ మెడికల్ క్లియరెన్స్ పొందడంతో జట్టు ఎంపికలో పెద్ద సంక్లిష్టత ఎదురవలేదు.
సూర్యకుమార్ వైపే మొగ్గు
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఖాయం కాగా.. రిజర్వ్ ఓపెనర్‌తో పాటు అదనపు వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసినట్లు అగార్కర్ తెలిపాడు. అయితే రాహుల్, ఇషాన్ ఒకేసారి తుది జట్టులో కొనసాగే అవకాశాలు తక్కువే అని రోహిత్ పేర్కొన్నాడు. ఇక గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్, రాహుల్‌తో పాటు సూర్యకుమార్‌కు మిడిలార్డర్లో చోటు దక్కింది. తిలక్ వర్మ అందుబాటులో ఉన్నా.. అనుభవ రిత్యా సూర్యకుమార్‌కే చోటు దక్కింది. ఇప్పటికే ఇద్దరు వికెట్ కీపర్లు ఉండటంతో శాంసన్ గురించి చర్చే రాలేదు. ఇక పేస్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్.. స్పిన్ ఆల్రౌండర్లుగా జడేజా, అక్షర్ పటేల్ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. కుల్దీప్ యాదవ్ ఒక్కడే స్పెషలిస్ట్ స్పిన్నర్ కాగా.. బుమ్రా, సిరాజ్, షమీ పేస్ భారం మోయనున్నారు.
తిలక్‌కు తప్పని నిరాశ
భారత క్రికెట్లో ఉత్తుంగతరంగంలా ఎదిగిన తెలంగాణ కుర్రాడు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మకు వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగే భారత జట్టులో చోటు దక్కలేదు. ఐపీఎల్, దేశవాళీ ఫామ్‌లో టీమ్ఇండియాలోకి వచ్చిన తిలక్.. వెస్టిండీస్ పర్యటనలో పొట్టి ఫార్మాట్లో దుమ్మురేపాడు. ప్రధాన ప్లేయర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన చోట..ఆకట్టుకున్నాడు. స్వతహాగా ఎడమ చేతి వాటం ప్లేయర్ అయిన ఈ హైదరాబాదీ.. జట్టు అవసరాలకు తగ్గట్లు గేర్లు మార్చడం మాజీలను సైతం కట్టిపడేసింది. దీంతో వరల్డ్‌కప్‌లో ఇలాంటి ప్లేయర్ ఉంటే బాగుంటుందనే వాదన బలంగా వినిపించింది. దీనికి తగ్గట్లే వర్మకు ఆసియాకప్ జట్టులో చోటు దక్కింది. తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన తిలక్‌ను.. వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయకపోవడమే ఉత్తమమని మాజీ ప్లేయర్లు సూచించారు.
రోహిత్ శర్మ (కెప్టెన్)
హార్దిక్ పాండ్యా (వైస్‌కెప్టెన్)
శుభ్‌మన్ గిల్
విరాట్ కోహ్లీ
శ్రేయస్ అయ్యర్
కేఎల్ రాహుల్
ఇషాన్ కిషన్
సూర్యకుమార్ యాదవ్
రవీంద్ర జడేజా
అక్షర్ పటేల్
కుల్దీప్ యాదవ్
శార్దూల్ ఠాకూర్
మహమ్మద్ షమీ
మహమ్మద్ సిరాజ్
జస్ప్రీత్ బుమ్రా