అహ్మదాబాద్: భారత క్రికెట్లో అనూహ్య మార్పులకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే శుభ్‌మన్ గిల్‌ను ఆల్‌ఫార్మాట్ కెప్టెన్‌గా భావిస్తున్న బోర్డు అందుకు తగ్గట్లు పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా క్రికెట్ దిగ్గజం రోహిత్‌శర్మకు చెక్ పెడుతూ వన్డే కెప్టెన్సీ బాధ్యతలు గిల్‌కు అప్పజెప్పింది. ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌ల కోసం శనివారం వేర్వేరు జట్లను బోర్డు ప్రకటించింది. ఫిట్నెస్ నిరూపించుకుంటూ కెప్టెన్‌గా కొనసాగుతాడనుకున్న రోహిత్‌ను బోర్డు ఎవరూ ఊహించని రీతిలో తప్పించింది.
2027లో జరిగే వన్డే ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టామని స్పష్టం చేసిన సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్..అందులో భాగంగానే రోహిత్‌తో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నాడు. టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్నాడు. టీ20లు, టెస్టులతో పోల్చుకుంటే వన్డేలు చాలా తక్కువ ఉండటం, ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ ఎందుకన్న ఆలోచనకు వచ్చిన బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
గిల్‌కు తోడు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్న శ్రేయాస్ అయ్యర్‌కు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చింది. లండన్‌లో నివాసముంటున్న విరాట్‌కోహ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకోగా, వరుస సిరీస్‌ల నేపథ్యంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వన్డేల నుంచి విశ్రాంతి ఇచ్చారు. ఆసియాకప్‌లో గాయపడ్డ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బదులుగా తెలుగు క్రికెటర్ నితీశ్‌కుమార్‌రెడ్డి రెండు జట్లలో చోటు దక్కించుకున్నాడు. టెస్టుల్లో తన ఫామ్ కొనసాగిస్తున్న యశస్వి జైస్వాల్‌కు సెలెక్టర్లు వన్డేల్లో చోటు కల్పించారు. ఈనెల 19వ తేదీ నుంచి భారత్, ఆసీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలుకానుంది. ఆ తర్వాత ఇరు జట్లు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి.
గిల్(కెప్టెన్), రోహిత్, కోహ్లీ, శ్రేయాస్(వైస్ కెప్టెన్), అక్షర్‌పటేల్, నితీశ్‌కుమార్, సుందర్, కుల్దీప్, హర్షిత్ రానా, సిరాజ్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, జురెల్, జైస్వాల్.
టీ20 టీమ్: సూర్యకుమార్(కెప్టెన్), అభిషేక్, గిల్(వైస్ కెప్టెన్), తిలక్‌వర్మ, నితీశ్‌కుమార్, దూబే,
అక్షర్‌పటేల్, జితేశ్శర్మ, వరుణ్, బుమ్రా, అర్ష్‌దీప్‌సింగ్, కుల్దీప్, హర్షిత్, శాంన్, రింకూసింగ్, సుందర్.
‘ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వన్డేలు పెద్దగా జరుగడం లేదు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టులో మార్పులు, చేర్పులు చేశాం. దీనిపై నాతో పాటు సెలెక్టర్లు రోహిత్‌తో మాట్లాడాం. వరల్డ్‌కప్ టోర్నీకి మరో రెండేండ్ల సమయమున్నా..అప్పటి వరకు గిల్ అనుభవం సంపాదించేందుకు మంచి అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఫార్మాట్‌కో కెప్టెన్ అనేది సరిగ్గా లేదు.
– అగార్కర్, సెలెక్షన్ కమిటీ చైర్మన్