భారత మహిళల లాన్‌బౌల్ జట్టు కొత్త చరిత్ర లిఖించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది. సోమవారం జరిగిన మహిళల ఫోర్స్ ఈవెంట్ సెమీఫైనల్లో భారత జట్టు 16-13 తేడాతో న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించింది. ఈ ఫార్మాట్లో మనోళ్లు తుదిపోరులో నిలువడం ఇదే తొలిసారి కావడం విశేషం. లవ్లీ చౌబే, పింకీ, నయన్మోనీ సైకియా, రూపారాణి టిర్కీతో కూడిన భారత బృందం..మంగళవారం దక్షిణాఫ్రికాతో పసిడి పతక పోరులో తలపడుతుంది. సెమీఫైనల్ విషయానికొస్తే..రెండో ఎండ్ ముగిసే సరికి భారత్ 0-5తో వెనుకంజలో నిలిచింది. అయితే ఒక్కసారిగా పుంజుకుని పోటీలోకి వచ్చిన మన మహిళలు కీలక పాయింట్లు కొల్లగొట్టారు. ఎండ్-9 ముగిసే సరికి స్కోరు 7-7తో సమం కాగా, పదో రౌండ్ తర్వాత భారత్ 10-7 ఆధిక్యం దక్కించుకుంది. ఎండ్-14 ముగిసే సరికి న్యూజిలాండ్ 13-12లో ముందంజలో నిలిచింది. ఇక్కడే టిర్కీ అద్భుతం చేసి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టింది. సూపర్ షాట్ సంధించి 16-13తో జట్టును గెలుపు తీరాలకు చేర్చింది. మరోవైపు పురుషుల జట్టు క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 8-26 తేడాతో నార్తర్న్ ఐర్లాండ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.