భారత క్రీడా చరిత్రలో సువర్ణాధ్యాయం. ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్‌లో మన ప్లేయర్లు పతక వందనం చేశారు. ‘ఇస్ బార్ సౌ పార్’ అన్న నినాదాన్ని చేతల్లో చూపిస్తూ పతకాల పంట పండించారు. పతక వేటలో ఆఖరి రోజైన శనివార భారత ప్లేయర్లు డజను పతకాలతో దుమ్మురేపారు. పురుషుల, మహిళల కబడ్డీలో పసిడి పతక జోరు దిగ్విజయంగా కొనసాగిస్తే..బ్యాడ్మింటన్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ పసిడి వెలుగులు విరజిమ్మింది.
ఆర్చరీలో తెలుగమ్మాయి జ్యోతిసురేఖ స్వర్ణ గురితో కదంతొక్కితే ఓజాస్, అభిషేక్, అదితి ప్రతిభ చాటారు. చెస్‌లో వెండితో ధగధగ మెరిస్తే..క్రికెట్లో మరో పసిడి మన ఖాతాలో చేరింది. మొత్తంగా 28 స్వర్ణాలు సహా 38 రజతాలు, 41 కాంస్యాలతో 107 పతకాలతో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. సుదీర్ఘ ఆసియాగేమ్స్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
హాంగ్జౌ: కాంటినెంటల్ టోర్నీ ఆసియా గేమ్స్‌లో భారత్ కొత్త చరిత్రకు నాంది పలికింది. గత రికార్డులను తిరుగరాస్తూ నయా శకానికి బాటలు వేసింది. స్పోర్ట్స్ పవర్‌హౌజ్‌లుగా వెలుగొందుతున్న చైనా, కొరియా, జపాన్‌కు దీటైన సవాల్ విసురుతూ ఆసియాడ్‌లో భారత్ దిగ్విజయంగా పతకాల వేట కొనసాగించింది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఏడాది ఆలస్యంగా జరిగిన మెగాటోర్నీలో భారత ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.
పదిహేను రోజుల పాటు అభిమానులను అలరించిన టోర్నీలో పోటీలకు ఆఖరి రోజైన శనివారం భారత్ 6 స్వర్ణాలు సహా నాలుగు రజతాలు, 2 కాంస్యాలతో 12 పతకాలు కొల్లగొట్టింది. ‘ఇస్ బార్ సౌ పార్’ నినాదాన్ని బాగా ఒంటపట్టించుకున్న మనోళ్లు జాతీయ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించారు. వచ్చే ఏడాది జరిగే పారిస్(2024) ఒలింపిక్స్‌కు ముందు మెండైన ఆత్మవిశ్వాసం సొంతం చేసుకున్నారు. హాంగ్జౌ ఆసియాడ్‌లో అథ్లెట్లు 29 పతకాలతో అగ్రస్థానంలో నిలిస్తే..22 పతకాలతో షూటర్లు తమ గురికి తిరుగులేదని చాటిచెప్పారు. మొత్తంగా 107 పతకాలతో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.
ఆర్చరీలో పతక జోరు:
ఈసారి ఆసియాడ్‌లో భారత్ ఆర్చర్లు తమ అద్భుత గురితో పతకాలు కొల్లగొట్టారు. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో జ్యోతి సురేఖ 149-145తో సో చీవాన్(కొరియా)పై అద్భుత విజయం సాధించింది. ఈ టోర్నీలో జ్యోతికి ఇది మూడో స్వర్ణం. మరోవైపు అదితి గోపీచంద్ కాంస్యాన్ని ముద్దాడింది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో భారత ఆర్చర్లు ఓజాస్ ప్రవీణ్ పసిడి దక్కించుకోగా, అభిషేక్‌వర్మ రజతం ఖాతాలో వేసుకున్నాడు.
అబ్బాయిలూ సాధించారు
శనివారం అఫ్గానిస్థాన్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో మెరుగైన ర్యాంక్ ఉన్న టీమ్ఇండియాను అంపైర్లు విజేతగా ప్రకటించారు. దాంతో రుతురాజ్ గైక్వాడ్ సేన స్వర్ణం పతకంతో సంబురాలు చేసుకుంది.
రెండు రజతాలు మనవే
చదరంగంలో భారత పురుషుల, మహిళల గ్రాండ్‌మాస్టర్ల బృందం రజత పతకం చేజిక్కించుకుంది. వరల్డ్ నంబర్ 1 ప్రజ్ఞానంద, గుకేశ్, విదిత్ గుజరాతీ, పెండ్యాల హరికృష్ణ, అర్జున్ ఎరిగైసీలతో కూడిన పురుషుల జట్టు 9, 10వ రౌండ్లో ఫిలీప్పీన్స్‌ను 3.5-0.5తో చిత్తు చేసింది. మహిళల విభాగంలో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, వంతిక అగర్వాల్, సవితా శ్రీలతో కూడిన బృందం దక్షిణా కొరియాపై 4-0తో గెలుపొందింది.
దీపక్ పూనియాకు రజతం
రెజ్లింగ్‌లో ఆఖరి రోజు కచ్చితంగా స్వర్ణం గెలుస్తాడనుకున్న దీపక్ పూనియా నిరాశపరిచాడు. 24 ఏళ్ల సంచలనం దీపక్ 86 కిలోల విభాగంలో రజతంతో సరిపెట్టుకున్నాడు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత మహిళల హాకీ జట్టు కాంస్యంతో సరిపెట్టుకుంది.
కబడ్డీలో పసిడి ధమాకా
పురుషుల కబడ్డీ ఫైనల్లో భారత్ 33-29 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఇరాన్‌ను మట్టికరిపించింది. దీంతో మెగాటోర్నీలో రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి పసిడి పతకాన్ని గర్వంగా ముద్దాడింది. హోరాహోరీగా సాగిన పోరులో రిఫరీ నిర్ణయం విషయంలో ఇరు జట్ల ప్లేయర్ల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. మరోవైపు నువ్వానేనా అన్నట్లు సాగిన మహిళల పోరులో భారత్ 26-25తో చైనీస్ తైపీ గెలిచిపై మూడోసారి పసిడి దక్కించుకుంది. రైడర్ పుష్ప భారత విజయంలో కీలకంగా వ్యవహరించింది.
సాత్విక్, చిరాగ్ నయా చరిత్ర
ఆసియాడ్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత జోడీగా సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి నిలిచింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్, చిరాగ్ ద్వయం 21-18, 21-16తో కొరియా జంట చోయి సుయి, కిమ్ వున్పై అద్భుత విజయం సాధించింది. సరిగ్గా 41 ఏండ్ల క్రితం 1982లో లీయోరీ డిసౌజ, ప్రదీప్ గందె జోడీ కాంస్యం గెలిచింది. ఈసారి డబుల్స్‌లో స్వర్ణం, పురుషుల టీమ్‌ఈవెంట్‌లో రజతం, సింగిల్స్‌లో కాంస్యం గెలువడం భారత్ అత్యుత్తమ ప్రదర్శనగా నమోదైంది.