పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత ఆటగాళ్లు.. దెబ్బతిన్న పులుల్లా విజృంభిస్తారనుకుంటే.. దీపావళి స్పెషల్ సేల్కు వరుసకట్టిన వారిలా ఒకరి వెంట ఒకరు పెవిలియన్ బాట పట్టారు. ప్రపంచ అగ్రశ్రేణి ప్లేయర్లుగా పేరున్న వాళ్లంతా పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోవడంతో టీమ్ఇండియాకు రెండో పరాజయం తప్పలేదు. చక్కటి బౌలింగ్‌తో కోహ్లీసేనను 110 పరుగులకే కట్టడి చేసిన కివీస్.. మరో 33 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది.
దుబాయ్: పొట్టి ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్ చేతిలో ఘోర పరాజయం పాలైన టీమ్ఇండియా.. మలి పోరులో అంతకుమించిన చెత్త ప్రదర్శనతో మరోసారి ఓటమి వైపు నిలిచింది. బ్యాటర్ల బాధ్యతారాహిత్యానికి.. బౌలర్ల అసహాయత తోడవడంతో భారత్‌కు రెండో పరాజయం తప్పలేదు. సూపర్-12లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో చిత్తైంది. గ్రూప్-2లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన కోహ్లీసేన పట్టికలో నమీబియా కంటే కింద ఐదో స్థానంలో నిలిచింది. ఇక్కడి నుంచి టీమ్ఇండియా నాకౌట్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గడంతో పాటు అనేక సమీకరణాలు అనుకూలించాల్సి ఉంటుంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ టాస్ ఓడటంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (26 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ కాగా.. లోకేశ్ రాహుల్ (18), ఇషాన్ కిషన్ (4), రోహిత్ శర్మ (14), విరాట్ కోహ్లీ (9), రిషబ్ పంత్ (12) విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, సోధీ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 111 పరుగులు చేసింది. డారిల్ మిషెల్ (49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (33 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి. భారత నాయక ద్వయాన్ని ఔట్ చేసిన సోధీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. తదుపరి మ్యాచ్‌లో బుధవారం అఫ్గానిస్థాన్‌తో టీమ్ఇండియా తలపడనుంది.
స్కోరు బోర్డు
భారత్: రాహుల్ (సి) మిషెల్ (బి) సౌథీ 18, ఇషాన్ (సి) మిషెల్ (బి) బౌల్ట్ 4, రోహిత్ (సి) గప్టిల్ (బి) సోధి 14, కోహ్లీ (సి) బౌల్ట్ (బి) సోధి 9, పంత్ (బి) మిల్నె 12, హార్దిక్ (సి) గప్టిల్ (బి) బౌల్ట్ 23, జడేజా (నాటౌట్) 26, శార్దూల్ (సి) గప్టిల్ (బి) బౌల్ట్ 0, షమీ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 20 ఓవర్లలో 110/7. వికెట్ల పతనం: 1-11, 2-35, 3-40, 4-48, 5-70, 6-94, 7-94, బౌలింగ్: బౌల్ట్ 4-0-20-3, సౌథీ 4-0-26-1, శాంట్నర్ 4-0-15-0, మిల్నె 4-0-30-1, సోధి 4-0-17-2.
న్యూజిలాండ్: గప్టిల్ (సి) శార్దూల్ (బి) బుమ్రా 20, మిషెల్ (సి) రాహుల్ (బి) బుమ్రా 49, విలియమ్సన్ (నాటౌట్) 33, కాన్వే (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 14.3 ఓవర్లలో 111/2. వికెట్ల పతనం: 1-24, 2-96, బౌలింగ్: వరుణ్ 4-0-23-0, బుమ్రా 4-0-19-2, జడేజా 2-0-23-0, షమీ 1-0-11-0, శార్దూల్ 1.3-0-17-0, హార్దిక్ పాండ్యా 2-0-17-0.