న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్(2030) ఆతిథ్య రేసులో భారత్ నిలిచింది. ఇప్పటి వరకు పోటీలో ఉన్న కెనడా తప్పుకోవడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు భారత ఒలింపిక్ సమాఖ్య(ఐవోఏ) వేగంగా పావులు కదిపింది. అనుకున్నదే తడువుగా బుధవారం జరిగిన ఐవోఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్‌జీఎమ్)లో 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు బిడ్డింగ్ వేసేందుకు ఆమోదముద్ర వేసింది. దిగ్గజ అథ్లెట్ పిటీ ఉష అధ్యక్షతన జరిగిన ఐవోఏ ఎస్‌జీఎమ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2010 తర్వాత తిరిగి కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యమివ్వాలన్న పట్టుదలతో ఉన్న భారత్ ఆ దిశగా మరో కీలక అడుగు వేసింది. దీనికి తోడు 2036 ఒలింపిక్స్ ఆతిథ్య రేసులో ఉన్న భారత్…కామన్వెల్త్ గేమ్స్‌ను అందుకు సన్నాహకంగా భావిస్తున్నది.
అహ్మదాబాద్ ఆతిథ్య నగరంగా గేమ్స్ నిర్వహించేందుకు ఇప్పటికే ఐవోఏ తమ సూత్రప్రాయ అంగీకారాన్ని తెలిపింది. అయితే ఈనెల 31లోగా భారత్ తుది బిడ్ సమర్పించాల్సి ఉంటుంది. 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్‌తో పాటు భువనేశ్వర్, ఢిల్లీ పోటీపడుతున్నాయి. అర్ధగంటలోనే ముగిసిన ఎస్జీమ్ తర్వాత ఐవోఏ చీఫ్ పిటీ ఉష మీడియాతో మాట్లాడుతూ ‘కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్యంపై ఎస్‌జీఎమ్‌లో అందరం ఏకగీవ్ర నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. సన్నాహకాలు ముందుకు సాగుతాయి. ఆతిథ్య నగరం రేసులో అహ్మదాబాద్ మాత్రమే కాదు.. భువనేశ్వర్, ఢిల్లీలోనూ మెరుగైన వసతులు ఉన్నాయి.
ఏ వేదికలో గేమ్స్ జరుగుతాయనేది త్వరలో ప్రకటిస్తాం. 2010లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించిన అనుభవం భారత్‌కు ఉంది. ఒకవేళ 2030 ఆతిథ్య హక్కులు మనకు దక్కితే అందుకు తగ్గట్లు ప్రణాళికలు రచించుకుంటాం’అని ఆమె పేర్కొంది. ఇదిలా ఉంటే ఐవోఏ సీఈవో రఘురామ్ అయ్యర్ స్పందిస్తూ ‘కామన్వెల్త్ ఆతిథ్యంపై ఇప్పుడే ఏం చెప్పలేం. 2030 కామన్వెల్త్ కోసం ఎన్ని దేశాలు పోటీపడుతున్నాయో ఇంకా తేలాల్సి ఉంది. కెనడా తప్పుకోవడం ఒక రకంగా భారత్ అవవకాశాలను మెరుగుపర్చింది’అని అన్నాడు.
ఆర్థికపరమైన కారణాల వల్ల 2026లో గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ గేమ్స్ నుంచి కొన్ని ఈవెంట్లను తప్పించగా, భారత్ మాత్రం అన్ని మెడల్ ఈవెంట్స్ నిర్వహించేందుకు సిద్ధమని పేర్కొంది. ముఖ్యంగా భారత్‌కు పతక అవకాశాలు మెరుగ్గా ఉన్న షూటింగ్, ఆర్చరీ, రెజ్లింగ్‌తో పాటు సంప్రదాయక క్రీడలైన కబడ్డీ, ఖోఖో, యోగాను కూడా చేర్చేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు ఐవోఏ సంయుక్త కార్యదర్శి కల్యాణ్ చౌబే పేర్కొన్నాడు. డైరెక్టర్ డారెన్ హాల్ ఆధ్వర్యంలో కామన్వెల్త్ స్పోర్ట్ ప్రతినిధులు ఇటీవలే అహ్మదాబాద్‌ను సందర్శించి వసతులను పరిశీలించారు. ముఖ్యంగా టోర్నీ ఆతిథ్యానికి సరిపోయే విధంగా వసతుల విషయంలో స్థానిక ప్రభుత్వ అధికారులను కామన్వెల్త్ ప్రతినిధులు పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఓవరాల్‌గా వారి నుంచి మెరుగైన స్పందన వచ్చిందని, కామన్వెల్త్ గేమ్స ఆతిథ్యంపై జనరల్ బాడీలో చర్చించడం మిగిలిందని చౌబే తెలిపాడు. అయితే ఈనెలాఖరులో లేదా సెప్టెంబర్‌లో కామన్వెల్త్ స్పోర్ట్ భారీ బృందం మరోమారు అహ్మదాబాద్‌ను సందర్శించే అవకాశముందని స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే 2026 కామన్వెల్త్ గేమ్స్‌కు వేదికైన గ్లాస్గోలో నవంబర్‌లో ఆఖరి వారంలో కామన్వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీ జరుగనుంది. ఇందులో 2030 ఆతిథ్య దేశం అధికారికంగా ఖరారు కానుంది.
ఐవోఏ సీఈవో రఘురామ్ అయ్యర్ నెలజీతానికి ఎస్‌జీఎమ్‌లో ఆమోదముద్ర పడింది. తొలుత అయ్యర్ నెలకు రూ.20లక్షలు ప్రతిపాదించినా..చివరికి 13 లక్షలకు ఓకే అయినట్లు తెలిసింది. దీంతో ఇన్ని రోజులుగా అయ్యర్ పదవీపై కొనసాగుతున్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. దీనికి తోడు 2023-24 వార్షిక సంవత్సరానికి సంబంధించిన పద్దులకు జనరల్ బాడీ ఆమోదముద్ర వేయగా, 2024-25 ఏడాదికి ఆడిటర్‌ను నియమించారు.