టీ20 వరల్డ్‌కప్‌లో అర్ష్‌దీప్ భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (4/9) నమోదుచేశాడు. గతంలో అశ్విన్ (4/11) పేరిట ఈ రికార్డు ఉండేది.
పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా న్యూయార్క్‌లో ఇప్పటిదాకా ఐదు మ్యాచ్‌లు జరుగగా ఇదే (111) అత్యుత్తమ ఛేదన.
Team India | ‘మినీ ఇండియా వర్సెస్ టీమ్ ఇండియా’గా అభిమానులు అభివర్ణించిన యూఎస్ఏ-భారత్ పోరులో రోహిత్ సేన ‘కష్టపడి’ గెలిచింది. ఆతిథ్య జట్టుకు ‘పసికూన’ ముద్ర ఇంకా చెరిగిపోకపోయినా, చేసింది
తక్కువ స్కోరే (110) అయినా యూఎస్ఏ బౌలర్లు రెచ్చిపోవడంతో ‘మెన్ ఇన్ బ్లూ’కు విజయం అంత సులభంగా దక్కలేదు. పేస్‌కు అనుకూలిస్తూ బ్యాటర్లకు ఏమాత్రం సహకరించని నసావు పిచ్ (న్యూయార్క్)పై ప్రపంచ స్థాయి బ్యాటర్లు కోహ్లీ, రోహిత్ చేతులెత్తేయగా ‘నయా 360’ సూర్యకుమార్ యాదవ్ అర్ధశతకంతో ఆదుకున్నాడు. అతడికి అండగా శివమ్ దూబే పోరాటంతో భారత్ ఉత్కంఠ విజయాన్ని నమోదుచేసింది. తొలుత అర్ష్‌దీప్ సింగ్ తన బౌలింగ్‌తో అమెరికాను తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు. ‘లో స్కోరింగ్ థ్రిల్లర్’గా సాగిన ఈ మ్యాచ్‌లో నెగ్గడంతో భారత్ సూపర్ -8కు అర్హత సాధించింది.
న్యూయార్క్: వరుసగా మూడు విజయాలతో టీ20 ప్రపంచకప్‌లో భారత్ సూపర్-8కు దూసుకెళ్లింది. యూఎస్ఏతో న్యూయార్క్‌లోని నసావు స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై 7 వికెట్ల తేడాతో నెగ్గింది. చేసింది తక్కువ స్కోరే అయినా అమెరికా పోరాడి ఓడింది. 111 పరుగులను ఛేదించేందుకు భారత్ 18.2 ఓవర్లు వేచి చూడాల్సి వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 50 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), శివమ్ దూబె (35 బంతుల్లో 31 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన యూఎస్ఏ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ (23 బంతుల్లో 27, 2 ఫోర్లు, 1 సిక్స్), స్టీవెన్ టేలర్ (30 బంతుల్లో 24, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. అర్ష్‌దీప్ సింగ్ (4/9) నిప్పులు చెరిగే బంతులతో అమెరికాను కోలుకోనీయలేదు. హార్దిక్ పాండ్యా (2/14) రాణించాడు. అర్ష్‌దీప్ సింగ్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై భారత యువ పేసర్ అర్ష్‌దీప్ పేస్ ధాటికి ఆతిథ్య జట్టు ఆదిలోనే కుదేలైంది. ఆ జట్టు ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మొదటి బంతికే ఓపెనర్ జహంగీర్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అర్ష్‌దీప్.. అదే ఓవర్లో చివరి బంతికి ఆండ్రిస్ గోస్ (2)ను ఔట్ చేసి అమెరికాకు డబుల్ షాకులిచ్చాడు. హార్దిక్, బుమ్రా సైతం కట్టడి చేయడంతో అమెరికాకు పరుగుల రాక గగనమైంది. గత రెండు మ్యాచ్‌లలో అమెరికా విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆరోన్ జోన్స్ (11).. హార్దిక్ 8వ ఓవర్లో బౌండరీలైన్ వద్ద సిరాజ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. 11 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు చేసింది 48 పరుగులే. ఈ క్రమంలో టేలర్, నితీశ్ వేగంగా ఆడకపోయినా వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కానీ అక్షర్ పటేల్ 12వ ఓవర్లో మూడో బంతిని లాంగాఫ్ మీదుగా సిక్సర్ బాదిన టేలర్.. ఆ మరుసటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హార్దిక్ 13వ ఓవర్లో 6,4 బాదిన నితీశ్.. అర్ష్‌దీప్ 15వ ఓవర్లో సిరాజ్ చేతికి చిక్కాడు. హార్దిక్ 17వ ఓవర్లో కోరె అండర్సన్ (15)ను బోల్తా కొట్టించాడు. చివరి 6 ఓవర్లలో యూఎస్ఏ 3 కీలక వికెట్లు కోల్పోయి 30 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.
స్వల్ప ఛేదనలో భారత్ కూడా పడుతూ లేస్తూ లక్ష్యం వైపునకు సాగింది. సౌరబ్ నేత్రవల్కర్ ఆరంభ ఓవర్లలో భారత్‌కు భారీ షాకులిచ్చాడు. ఈ టోర్నీలో వరుసగా విఫలమవుతున్న కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే కోహ్లీ డకౌట్ కాగా మరుసటి ఓవర్లో రోహిత్ శర్మ (3) హర్మీత్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఈ రెండు వికెట్లూ నేత్రవల్కర్కే దక్కాయి. 20 బంతులాడి ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన రిషభ్ పంత్ సైతం అలీఖాన్ 8వ ఓవర్లో క్లీన్ బౌల్డ్ అవడంతో భారత అభిమానులు ఒకింత ఆందోళనకు లోనయ్యారు. ఇదే సమయంలో అమెరికా బౌలర్లు కట్టడిచేయడంతో మిడిల్ ఓవర్స్‌లో భారత్ రన్ రేట్ 4 దాటలేదు. కానీ గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన సూర్యకుమార్, దూబె భారత్‌ను ఆదుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లు కవ్వించే బంతులు విసిరినా అనవసరపు షాట్ల జోలికి పోకుండా నెమ్మదిగా ఆడారు. 13వ ఓవర్లో 23 పరుగుల వద్ద నేత్రవల్కర్ క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయిన సూర్య.. ఆ తర్వాత వేగం పెంచాడు. సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతండటంతో.. అండర్సన్ 15వ ఓవర్లో దూబె భారీ సిక్సర్ బాదాడు. 17వ ఓవర్లో సూర్య 6,4తో భారత్ వంద పరుగుల మార్కును దాటింది. ఈ ఇరువురూ మూడో వికెట్‌కు అజేయమైన 72 పరుగులు జోడించడమే గాక చివరిదాకా క్రీజులో నిలిచి భారత్‌ను సూపర్-8కు చేర్చారు.
యూఎస్ఏ: 20 ఓవర్లలో 110/8 (నితీశ్ 27, టేలర్ 24, అర్ష్‌దీప్ 4/9, హార్దిక్ 2/14).
భారత్: 18.2 ఓవర్లలో 111/3 (సూర్య 50 నాటౌట్, దూబె 31 నాటౌట్, నేత్రవల్కర్ 2/18, అలీ ఖాన్ 1/21)