ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. లీగ్ దశలో అమెరికాలో ఇరుగదీసిన టీమ్ఇండియా కరీబియన్ ఇలాఖాలో కదంతొక్కింది. అఫ్గానిస్థాన్‌తో సూపర్-8 పోరులో ఘన విజయంతో బోణీ కొట్టింది. సూర్యకుమార్‌యాదవ్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌తో భారీ స్కోరు అందుకున్న భారత్ బార్బడోస్‌లో అఫ్గన్‌ను మట్టికరిపించింది. బుమ్రా, అర్ష్‌దీప్‌సింగ్ విజృంభణతో అఫ్గన్‌ను 134 పరుగులకే పరిమితం చేస్తూ కప్ వేటలో మరో అడుగు ముందుకేసింది.
T20 World Cup | బ్రిడ్జ్‌టౌన్: తమ సుదీర్ఘ కలను సాకారం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న భారత్ ఆ దిశగా అడుగులు ముందుకేస్తున్నది. గురువారం బార్బడోస్ వేదికగా జరిగిన సూపర్-8 తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై 47 పరుగుల తేడాతో భారత్ విజయదుందుభి మోగించింది. లీగ్ దశ విజయ పరంపరను కొనసాగిస్తూ సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది.
మొదట సూర్యకుమార్‌యాదవ్(28 బంతుల్లో 53, 5ఫోర్లు, 3సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 32, 3ఫోర్లు, 2సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 181/8 స్కోరు చేసింది. ఫజుల్లా ఫారుఖి(3/33), రషీద్‌ఖాన్(3/26) మూడేసి వికెట్లు తీశారు. లక్ష్యఛేదనలో బుమ్రా(3/7), అర్ష్‌దీప్‌సింగ్(3/36) ధాటికి అఫ్గన్ 20 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. అజ్మతుల్లా ఒమర్జాయ్(26) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అర్ధసెంచరీతో జట్టుకు పోరాడే స్కోరు అందించిన సూర్యకుమార్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. తమ తదుపరి మ్యాచ్‌లో శనివారం బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది.
అఫ్గన్ పేలవంగా:
భారత్ నిర్దేశించిన లక్ష్యఛేదనలో అఫ్గన్‌కు సరైన శుభారంభం దక్కలేదు. మ్యాచ్‌కు ముందు బీరాలు పలికిన ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(11)ను బుమ్రా తొలి వికెట్‌గా సాగనంపి వికెట్ల వేటకు తెరతీశాడు. ఓవైపు బుమ్రా స్వింగ్‌కు తోడు స్పిన్నర్లు కుల్దీప్యాదవ్ (2/32), అక్షర్‌పటేల్ (1/15), జడేజా (1/20) విజృంభణతో అఫ్గన్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్లో అజ్మతుల్లా, నయిబ్ (17) నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. హజ్రతుల్లా(2), జద్రాన్(8) ఘోరంగా విఫలమయ్యారు. ఆదిలో తడబడ్డ అర్ష్‌దీప్ ఆఖర్లో టెయిలెండర్ల వికెట్లు తీసి విజయంలో కీలకమయ్యాడు.
పడుతూ లేస్తూ:
తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తాను ఎదుర్కొన్న ఐదో బంతికి బౌండరీతో పరుగుల ఖాతా తెరిచిన రోహిత్(8) ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్(20)..కోహ్లీ(24)కి జతకలిశాడు. వీరిద్దరు మరో వికెట్ కోల్పోకుండా సమయోచితంగా వ్యవహరిస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. నబీ వేసిన ఆరో ఓవర్లో పంత్ హ్యాట్రిక్ ఫోర్లతో అదరగొట్టాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. రషీద్ బౌలింగ్‌లో భారత్ 90 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.
సూర్య, పాండ్యా ధనాధన్:
ఇబ్బందుల్లో ఉన్న టీమ్ఇండియా ఇన్నింగ్స్‌ను సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా గాడిలో పడేశారు. సూర్య తనదైన శైలిలో బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరిగెత్తించడంతో భారత్ 13వ ఓవర్లో 100 పరుగుల మార్క్ అందుకుంది.సూర్యకు పోటీగా పాండ్యా కూడా బ్యాటు ఝులిపించడంతో పరుగుల రాక సులువైంది. ఫోర్‌తో అర్ధసెంచరీ అందుకున్న సూర్య మరుసటి బంతికే ఔట్ కావడంతో ఐదో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. వీరి బ్యాటింగ్‌తో భారత్ పోరాడే స్కోరు అందుకుంది.
సంక్షిప్త స్కోర్లు:
భారత్: 20 ఓవర్లలో 181/8(సూర్యకుమార్ 53, హార్దిక్ 32, రషీద్ 3/26, ఫారుఖి 3/33), అఫ్గానిస్థాన్: 20 ఓవర్లలో 134 ఆలౌట్(అజ్మతుల్లా 26, నజీబుల్లా 19, బుమ్రా 3/7, అర్ష్‌దీప్‌సింగ్ 3/36)