Paralympics | పారిస్: ప్రతిష్ఠాత్మక పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ శుభారంభం చేసింది. పోటీల తొలి రోజైన గురువారం మన పారా అథ్లెట్లు వేర్వేరు విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా పారా ఆర్చర్ శీతల్‌దేవి అంచనాలకు మించి రాణించింది. బరిలోకి దిగింది తొలిసారే అయినా ఎక్కడా తడబాటుకు లోనుకాకుండా రాణించింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌండ్లో శీతల్‌దేవి 703 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
ఇదే విభాగంలో టర్కీ ఆర్చర్ ఒజ్నుర్ గిరిడి కుర్ 704(ప్రపంచ రికార్డు) టాప్‌లో నిలిచింది. రెండో స్థానంలో నిలువడం ద్వారా 17 ఏండ్ల శీతల్ నేరుగా రౌండ్-16కు అర్హత సాధించగా, ఇదే విభాగంలో మరో ఆర్చర్ సరితాదేవి(682) తొమ్మిదో స్థానం దక్కించుకుంది. అదే జోరు కొనసాగిస్తూ మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్లో శీతల్‌దేవి, ఆర్ కుమార్ ద్వయం ప్రపంచ రికార్డు(1399) స్కోరుతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. చెక్కుచెదరని గురితో ఈ ఇద్దరు కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నారు.
భారత షట్లర్లు అదరగొట్టారు. వ్యక్తిగత విభాగంలో ఎనిమిది షట్లర్లు తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. సుహాస్, సుకాంత్ కదమ్, తరుణ్(ఎస్ఎల్ 4), నితీశ్‌కుమార్(ఎస్ఎల్ 3), పాలక్ కోహ్లీ(ఎస్ఎల్ 4), తులసిమతి మురుగేశన్(ఎస్యు 5), మనీశ రామదాస్(ఎస్యు 5), నిత్యశ్రీ సుమతి శివన్(ఎస్‌హెచ్ 6) తొలి రౌండ్లలో ప్రత్యర్థులపై విజయాలు సాధించారు. ఇదిలా ఉంటే మహిళల 47కిలోల కే44 విభాగంలో అరుణాసింగ్ తన్వర్ 0-19తో నురిచియాన్(టర్కీ) చేతిలో ఓటమిపాలైంది. మహిళల సైక్లింగ్ పర్య్సూట్‌లో జ్యోతి గదేరియా పదో స్థానంలో నిలిచి నిరాశపరిచింది.