KL Rahul | మెల్బోర్న్: ఆస్ట్రేలియా పర్యటన కోసం మిగతా భారత ఆటగాళ్ల కంటే అక్కడికి ముందే వెళ్లిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. తొలి టెస్టులో రోహిత్ స్థానాన్ని భర్తీ చేసేందుకు సెలక్టర్లు అతడిని ఆస్ట్రేలియా ‘ఏ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ఆడించినా రాహుల్ 4 పరుగులే చేసి నిష్క్రమించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇదే ప్రదర్శన పునరావృతమైతే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి రాహుల్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇక మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్, గత ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన సాయి సుదర్శన్ డకౌట్ అయ్యారు. కెప్టెన్ రుతురాజ్ (4), దేవ్‌దత్ పడిక్కల్ (26), నితీశ్ రెడ్డి (16) విఫలమైనా వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (80) జట్టును ఆదుకున్నాడు. కంగారూల బౌలింగ్ దాడిని సమర్థంగా తిప్పికొడుతూ జురెల్ సాధికారిక అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. స్టార్ బ్యాటర్లంతా విఫలమవడంతో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్.. 161 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్ నెసర్(4/27), వెబ్‌స్టర్(3/19) రాణించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్.. 17.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది.