Indy Racing | క్రాన్స్ మెంటానా(స్విట్జర్లాండ్): భారత తొలి ఎలక్ట్రిక్ బైక్ రేసింగ్ జట్టు ‘ఇండీ రేసింగ్’ కొత్త చరిత్ర లిఖించింది. ఎఫ్ఐఎం-ఈ ఎక్స్‌ప్లోరర్ వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగిన తొలిసారే మూడో స్థానంలో నిలిచి సత్తాచాటింది. స్విట్జర్లాండ్‌లోని క్రాన్స్ మెంటానా వేదికగా జరిగిన మోగాటోర్నీ చివరి రౌండ్లో ఇండీ రేసింగ్ మహిళా రైడర్ శాండ్రా గోమెజ్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది.
మహిళల విభాగంలో గోమెజ్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలువగా, ఓవరాల్‌గా ఇండీ రేసింగ్ మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన నాలుగు రేసుల్లో ఇండీ రేసింగ్ 479 పాయింట్లు సాధించగా, బోనెల్ రేసింగ్ (498), హోండా రేసింగ్ టీమ్ (490) తొలి రెండు స్థానాలు దక్కించుకున్నాయి. మహిళల కేటగిరీలో గోమెజ్ 271 పాయింట్లతో సీజన్ విజేతగా నిలిచింది. ప్రపంచ ఈ-రేసింగ్ టోర్నీలో భారత్‌కు పతకం దక్కడం సంతోషంగా ఉందని ఇండీ రేసింగ్ యజమాని అభిషేక్‌రెడ్డి పేర్కొన్నారు. పోటీకి దిగిన తొలి సీజన్లోనే రాణించడం గర్వంగా ఉందన్నారు.